Zaheerabad Sugar Factory Worker Protest : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో కార్మికుడు పొగ గొట్టం ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. గత ఏడాది కాలంగా వేతనాలు చెల్లించడం లేదని కార్మికుడు రమేశ్ బాబు మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈరోజు పొగ గొట్టం చిమ్నీ ఎక్కి నిరసనకు దిగాడు. వారం రోజుల్లో కూతురు పెళ్లి ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక పోతున్నానని వాపోయాడు. అధికారులు వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాడు.
గత రెండు సంవత్సరాలుగా చక్కెర కర్మాగారం మూతబడిపోయింది. కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించకపోవడం సహా కార్మికులకు ఇవాల్సిన వేతన బకాయిలు ఇవ్వడం లేదని 165 మంది కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రమేశ్ బాబు చిమ్నీ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, కార్మిక విభాగం అధికారులు కర్మాగారానికి చేరుకొని కిందకు రమేశ్ బాబును దింపేందుకు ప్రయత్నించారు. ఎంత నచ్చజెప్పినా అతడు వినలేదు.
జిల్లా కలెక్టర్ వచ్చి వేతన బకాయిలు చెల్లింపులు, కర్మాగారం పునరుద్ధరణ హామీ ఇస్తే కిందకు దిగుతానని కార్మికుడు రమేశ్ బాబు ఫోన్లో అధికారులకు వివరించాడు. బాధితుడి సమస్యను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని కార్మిక నాయకులు భీష్మించి కూర్చున్నారు. కార్మికుడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వేతనాలు ఇప్పించేలా ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.
"మా కార్మికుల సమస్యలను అధికారులు పట్టించుకోవట్లేదు. ఏడాది కాలంగా కంపెనీ మాకు వేతనాలు చెల్లించడం లేదు. జీతాలు ఇవ్వకపోవడంతో ఇంట్లో సమస్యలు ఎక్కువయ్యాయి. కర్మాగారం పునరుద్ధరణ చేసి సంక్రమంగా జీతాలు ఇవ్వాలి లేకుంటే ధర్నాలు చేస్తాం. -చక్కెర కర్మాగార కార్శికులు
ట్రైడెంట్ చక్కర కర్మాగారం : గత ప్రభుత్వాలు స్థిరాస్తి వ్యాపారం మాదిరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటుకు అమ్మేశారని కార్మికులు ఆరోపించారు. రైతు ప్రభుత్వంగా ఉండే కాంగ్రెస్ సర్కారు కేవలం రూ.100 కోట్లు వెచ్చిస్తే జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులకు సమస్యలు పూర్తిగా తీరిపోతాయని వేడుకుంటున్నారు. రైతులకు ఇంకా బకాయిగా ఉన్న రెండున్నర కోట్లతో పాటు కార్మికుల వేతన బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలని రైతులు, కార్శికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
నిజాం చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు - కార్మికుల్లో చిగురిస్తున్న ఆశలు