YSRCP Rebel Candidates: వైసీపీ అధిష్ఠానం ఇష్టానుసారం రాజకీయ బదిలీలకు తెరలేపగా టిక్కెట్లు కోల్పోతున్న అసంతృప్త ఎమ్మెల్యేలు అధినాయకత్వంపైనే నేరుగా యుద్ధం ప్రకటిస్తున్నారు. మీరు చేసేది చేసుకుంటూ వెళ్తే, మేం ఏం చేయాలో మాకు తెలుసంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తమను కాదని నియోజకవర్గాల్లో ఎన్నికలకు ఎలా వస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. భారీ బలప్రదర్శనలతో పరపతి చాటుతున్నారు.
30 వేల మందికి విందు: ఈనెల 12న పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 30 వేల మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి ఈ స్థాయిలో ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం విశేషం. నాకు జన బలముందని, పిఠాపురం సీటు విషయంలో జగన్ పునరాలోచించుకోవాలని ఆయన నేరుగానే అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా జగన్ ఫొటో కానీ, పార్టీ జెండా కానీ కనిపించకుండా చేయడం ద్వారా ఇదంతా నా సొంత బలమేనని చాటి చెప్పారు. ఈ పరిణామాలతో హతాశులైన పిఠాపురం సమన్వయకర్తగా నియమితురాలైన వంగా గీతా హుటాహుటిన సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని నివేదించారు. దీంతో అధిష్ఠానం పెద్దలు దొరబాబును తాడేపల్లికి పిలిపించుకుని బుజ్జగింపుల పర్వానికి తెరదీశారు.
అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు: అదే విధంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సైతం అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి కాకినాడ పర్యటనకు సైతం ఆయన డుమ్మా కొట్టారు. అదే దారిలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సైతం సీఎం సభకు దూరంగా పార్టీ వర్గాల్లో కలవరపాటుకు దారితీసింది. ఆయన బయటపడపోయినా అంతర్గతంగా చేయాల్సిన పనులు చేస్తున్నారనే వాదన వ్యక్తమవుతోంది. దీంతో ఈ నియోజకవర్గాల్లో కొత్తగా నియమితులైన తోట నరసింహం, విప్పర్తి వేణుగోపాల్‌కు సహాయ నిరాకరణ భయం పట్టుకుంది.
కోడుమూరు వైసీపీలో అసమ్మతి - స్థానికేతరులకు టికెట్ ఎలా ఇస్తారని శ్రేణుల ఆగ్రహం
ప్రజా దీవెన పేరుతో పోరుబాటు: ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ‘ప్రజా దీవెన’ పేరుతో పోరుబాట పట్టారు. ఈనెల 12 నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా మొబైల్ యాప్‌తో జనం మద్దతు కూడగడుతున్నారు. వరుపుల సుబ్బారావును సమన్వయకర్తగా నియమించినా టిక్కెట్ మాత్రం తనదేనని దీమా వ్యక్తం చేస్తున్నారు.
అధినాయకత్వానికి హెచ్చరికలు: కనిగిరిలోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కొత్త సమన్వయకర్తగా నారాయణయాదవ్‌ను నియమించడంపై ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఎమ్మెల్యే వర్గీయులైన కనిగిరి మున్సిపల్ వైస్ ఛైర్మన్ సహా 8 మంది కౌన్సిలర్లు రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇతర నేతలు సైతం రాజీనామాలు చేస్తామని హెచ్చరించడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని పార్టీ నేతలంటున్నారు. గంగాధర నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్థానంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్పను సమన్వయకర్తగా నియమించడంపై డిప్యూటీ సీఎం వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చిత్తూరులో ప్రెస్‌మీట్ పెట్టి మరీ పార్టీ అధినాయకత్వానికి హెచ్చరికలు జారీ చేయడం ఆసక్తిగా మారింది.
సీఎం వద్దకు రావాలని కోరినా ససేమిరా: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే సైతం పార్టీపై గుర్రుగా ఉన్నారు. రెండుమూడు రో జుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పడంతో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు ఇప్పటికే రెండుసార్లు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. సీఎం వద్దకు రావాలని కోరినా ఆయన ససేమిరా అన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సైతం అధిష్ఠానం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు కోసం రెండురోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
వైఎస్సార్సీపీలో ప్రకంపనలు - అధిష్ఠానం నిర్ణయంపై నిరసన జ్వాలలు
లోలోపల రగిలిపోతున్న నేతలు: తిరుగులేని ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో మూడు రాజ్యసభ స్థానాలు సునాయసంగా కైవసం చేసుకోవచ్చని భావించిన వైసీపీ పెద్దలకు అసంతృప్తి ఎమ్మెల్యేల తిరుగుబావుటా ముచ్చెమటలు పట్టిస్తోంది. అంసతృప్తి ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తారన్న నమ్మకాన్ని దాదాపు వదిలేసుకుంది. ఇలాంటి వారు దాదాపు 29 మంది ఉన్నట్లు లెక్క తేలింది. మిగిలిన వారు ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థులకు ఓటు వేస్తేనే ఈ గండం గట్టెక్కే అవకాశం ఉంది. కానీ బయటపడకుండా లోలోపల రగిలిపోతున్న నేతల ఆంతర్యం, వారి సంఖ్యపై అధిష్ఠానం పెద్దలకు అంతుబట్టడం లేదు. పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలను ముఖ్య నేతలు బుజ్జగిస్తున్నారు.
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డితో స్వయంగా ముఖ్యమంత్రే రెండు, మూడు సార్లు చర్చించాల్సి వచ్చింది. ఆయన కోరినట్లు ఒంగోలులో ఇళ్లపట్టాల కోసం సేకరించిన భూమికి పరిహారం మొత్తం 200 కోట్లనూ మంజూరు చేశారు. జిల్లాలో ఆయన కోరిన అభ్యర్థులనే రెండు చోట్ల ఖరారు చేశారు. నందికొట్కూరు నియోకజవరంలో కొత్త అభ్యర్థిని నియమించే విషయంలో ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డితో కూడా జగన్ మూడు సార్లు కూర్చుని మాట్లాడాల్సి వచ్చింది.
ముఖ్యనేతలు బుజ్జగించినా: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, శింగనమల ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివారెడ్డితో ముఖ్యమంత్రి ఒకటికి రెండుసార్లు మాట్లాడారు. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికి ఇచ్చినా, పెత్తనం మాత్రం మీదే ఉంటుందంటూ బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథితో సీఎం గంటసేపు మాట్లాడినా ఆయన వెనక్కి తగ్గలేదని తెలిసింది. పార్టీ ముఖ్యనేతలు బుజ్జగించినా దిగొచ్చేలా కనిపించడం లేదు.
వైఎస్సార్సీపీలో అసమ్మతి మంటలు- రాజీనామాలకైనా సిద్ధమంటున్న ప్రజాప్రతినిధులు