YSRCP Leaders Violating Model Code of Conduct: సార్వత్రికల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సమావేశాలు, ప్రచారాలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల అధికారుల ఫిర్యాదుతో వరసగా రెండు రోజుల పాటు ప్రొద్దుటూరులో వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
రెండు ఘటనలు కూడా ఎమ్మెల్యే పాల్గొన్న సమావేశాలే కావడం విశేషం. ఈనెల 17న ప్రొద్దుటూరులో నిర్వహించిన దూదేకుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు పాల్గొని ప్రసంగించారు. అదే సమావేశానికి వచ్చిన మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి టోకెన్లు ఇచ్చారు. ఈ వార్తలు మీడియాలో ప్రసారం కావడంతో జిల్లా కలెక్టర్ విజయరామరాజు విచారణకు ఆదేశించారు. ఫలితంగా వైసీపీ నాయకులు దస్తగిరి, నాగూర్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి సీఎం, మంత్రుల ఫొటోలు తొలగించండి - సీఎస్ ఆదేశాలు
అదే సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నప్పటికీ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతోపాటు ప్రొద్దుటూరులో నెలరోజుల నుంచే వాలంటీర్లకు గోడగడియారాలు అందజేస్తున్నట్లు వెలుగులోకి వచ్చాయి. జగన్, అవినాష్, రాచమల్లు ఫోటోలతో ముద్రించిన గోడ గడియారాలను వాలంటీర్లకు నెలరోజుల నుంచి పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా కడప నగరంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా క్యాంపు కార్యాలయం నుంచే పదిరోజుల కిందట కొందరు పాత్రికేయులకు కూడా తాయిలాలు పంపిణీ చేశారు.
ఒక్కో పాత్రికేయుడికి పట్టుచీర, ప్యాంట్, షర్టుతో కూడిన బాక్సు అందజేశారు. మంగళవారం కూడా ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరులోని 38వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు ప్రచారాన్ని అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేయడం కుదరదని చెప్పడంతో ఎమ్మెల్యే ప్రచారం నిలిపివేసి వెళ్లిపోయారు.
వైఎస్సార్సీపీకి వర్తించని ఎన్నికల కోడ్ - ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా దర్శనమిస్తున్న జగన్ ఫొటోలు
ప్రచారం నిర్వహణకు ఈసీ సూచించిన సువిధ యాప్ లేదంటే ఎన్నికల అధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి గానీ పొందాల్సి ఉంది. కానీ ఇవేమి చేయకుండా ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించడంతో అధికారులు నిలిపివేశారు. 38వ వార్డులో ప్రచారానికి కారకులైన వైసీపీ కౌన్సిలర్ రమాదేవి, కుమారుడు మహేశ్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు అనుమతి లేకుండా భారీ ర్యాలీ నిర్వహించడం కోడ్ ఉల్లంఘనల కిందకే వస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తెలుగుదేశం నేత రెడ్యెం వెంకటసుబ్బారెడ్డి వైసీపీలోకి చేరడానికి మైదుకూరులో సభ ఏర్పాటు చేయగా అవినాష్‌రెడ్డి, రఘురామిరెడ్డి హాజరయ్యారు. రెడ్యెం వెంకటసుబ్బారెడ్డి తన స్వగ్రామమైన దుంపలగుట్టు నుంచి మైదుకూరు వరకు వాహనాలు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా సభకు చేరుకున్నారు. కానీ ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. కోడ్ ఉల్లంఘించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మైదుకూరుకు చెందిన తెలుగుదేశం నేతలు ఎన్నికల సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు భారీ ర్యాలీ చేసిన వీడియో కూడా యాప్‌లో పోస్టు చేశారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.