YSRCP Leaders Attacks on Journalists: వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. వారికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో జర్నలిస్టులను కూడా వదలటం లేదు. ఇసుక మాఫియా అరాచకాలను బయటపెట్టేందుకు వెళ్లిన అమరావతి 'న్యూస్ టుడే' కంట్రిబ్యూటర్పై ఇటీవల దాడికి చేయగా.. తాజాగా మరో జర్నలిస్టుపై దాడికి తెగబడ్డారు. ఇలా తమకు అడ్డొచ్చిన వారందరిపై ఉక్కుపాదం మోపుతూ వైఎస్సార్సీపీ అరాచకాలకు అడ్డే లేదన్నట్లుగా పేట్రేగిపోతున్నారు.
'మీడియాపై జగన్ ఫ్యాక్షన్ దాడి': అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం 'సిద్ధం' సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టు ఫొటోలు తీయడం నిషిద్ధమా, నేరమా అని నిలదీశారు. ఇది మీడియాపై జగన్ చేసిన ఫ్యాక్షన్ దాడి అని మండిపడ్డారు. ఒక పత్రిక, ఛానెల్ యజమాని అయిన జగన్ ఇటువంటి దాడులు ప్రోత్సహించడం, తన సంస్థల్లో పనిచేసే వారందరినీ రిస్క్‌లో పెట్టడమేనని దుయ్యబట్టారు.
రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేతలు - ఈనాడు విలేకరిపై దాడి
'భారత రాజ్యాంగం అంటే జగన్ సర్కార్‌కు లెక్కలేదు': వైఎస్సార్సీపీ నేతలు ఓటమి భయంతో జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ 'సిద్ధం' సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ కృష్ణపై వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడి వారి అరాచకాల పరాకాష్టకు నిదర్శనమన్నారు. విధినిర్వహణలో భాగంగా జర్నలిస్టు ఫొటోలు తీస్తే వైఎస్సార్సీపీ నేతలకు అంత ఉలుకెందుకో అని నిలదీశారు.
భారత రాజ్యాంగం అంటే జగన్ సర్కార్‌కు లెక్కలేకుండా పోయిందన్నారు. పత్రికలన్నీ సాక్షిలాగా అబద్ధాలు రాసుకుంటూ భజన చేయాలా అని ప్రశ్నించారు. మీడియాపైనే దారుణాలకు దిగుతుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందన్నారు. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండించిన సోమిరెడ్డి.. వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జగన్ రెడ్డి పేరును జలగ రెడ్డిగా మార్చుకుంటే బాగుంటుంది: తులసిరెడ్డి
జర్నలిస్టుల ఆందోళన: మీడియాపై వైఎస్సార్సీపీ నేతల దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. కడపలో కలెక్టరేట్ వద్ద జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీలు, వామపక్షాలు ధర్నాలో పాల్గొన్నాయి. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు.
తిరుపతిలో ప్రెస్‌క్లబ్ నుంచి గాంధీ విగ్రహం వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. జర్నలిస్టులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్యే పయ్యావుల, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పార్థసారథి, ప్రభాకర్‌చౌదరి, సీపీఐ నేతలు పాల్గొని మద్దతు తెలిపారు.
తెలుగు యువత అధికార ప్రతినిధిపై వైసీపీ అనుచరుల దాడి - ఖండించిన లోకేశ్