MADANAPALLE FIRE ACCIDENT CASE : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టరేట్ ఫైళ్ల దహనం కేసులో పోలీసుల ధర్యాప్తు వేగవంతం చేశారు. దాదాపు ఏడు రోజులుగా సాగుతున్న విచారణలో రెవెన్యూశాఖ ఉద్యోగులతో పాటు పలువురు Y.C.P. నేతలను విచారించారు. అనుమానితులుగా భావిస్తున్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరుల ఇళ్లలో తనిఖీల చేశారు. ఆయా నేతలను డీఎస్సీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తున్నారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిషేధిత, చుక్కల, ఆసైన్డ్ భూములు దస్త్రాల దగ్ధమైన కేసులో పోలీసులు తమ విచారణను విస్తృతం చేశారు. ఏడు రోజులుగా సాగుతున్న ధర్యాప్తులో వైఎస్సార్సీపీ నేతలను విచారిస్తున్నారు. మిథున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు మదనపల్లెకు చెందిన బాబ్‌జాన్ అలియాస్ సెటిల్‌మెంట్ బాబ్‌జాన్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మదనపల్లె వైఎస్సార్సీపీ మాజీ శాసనసభ్యుడు నవాజ్‌బాషా ఇంట్లో సోదాలు చేసి ఆయనను విచారించారు. శనివారం రాత్రి నుంచి బాబ్‌జాన్, నవాజ్‌బాషా ఇళ్ల వద్ద కాపు కాసిన పోలీసులు ఇవాళ ఉదయం నుంచి సోదాలు చేశారు. మాజీ శాసనసభ్యుడు నవాజ్‌బాషా బెంగళూరులో ఉండటంతో ఆయనను పిలిపించి మదనపల్లెలోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు, తంబళ్లపల్లె శాసనసభ్యుడు ద్వారకానాథ్‌రెడ్డి ఇంట్లో తంబళ్లపల్లెలో సోదాలు చేపట్టారు.
మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ ఇంట్లో పోలీసులు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని శశికాంత్ ఇంట్లో సీఐ రమేష్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగాయి. ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో శశికాంత్ నివాసం ఉంటున్నారు. తనిఖీల సమయంలో శశికాంత్ అందుబాటులో లేకపోవడంతో ఆ మాజీ ఎమ్మెల్యేను పిలిచి ఏపీ పోలీసులు సోదాలు చేశారు. దాదాపు 8 గంటల పాటు సోదాలు నిర్వహించిన పోలీసులు శశికాంత్ ఇంట్లో కీలక దస్త్రాలు గుర్తించారు. నాలుగు బాక్సుల్లో వాటిని తీసుకెళ్లారు. తర్వాత మాదాపూర్ పోలీసులకు సమాచారమిచ్చి అదుపులోకి తీసుకున్నారు.
గడచిన ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివాదాస్పద భూములను ఆక్రమించడంలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు తమ అక్రమాలు బయటకు రాకుండా చేసే లక్ష్యంతో సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు భావించారు. ఆ దిశగా తమ విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు విచారణలో పలు ఆసక్తికరమైన, ఆశ్చర్యం కలిగించే అంశాలు బయటపడుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతల భూ అక్రమాలపై మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తుండగా బాధితులు భారీగా తరలివచ్చి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.
మదనపల్లె కేసులో కీలక పరిణామం - మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషాకు నోటీసులు