YSRCP Leader Irregularities in Godavari Districts: ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లోని ప్రాంతం అది. ఆ ఊళ్లో పుట్టడమే ఓ వరం అనుకుంటారు స్థానికులు! అలాంటి ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఆయన్ని ఎన్నుకోవడమే వారికి శాపమైంది. సామాన్యుడికి ఏ హక్కులూ స్వతంత్రంగా పొందలేని ప్రాంతంగా మార్చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎవరిపై అయినా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు కాదు. ఆయన ఫోన్ చేస్తేనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలో? వద్దో పోలీసులకు ఓ స్పష్టత వస్తుంది.
ఆయనకు కోపం వస్తే ఎదుటి పార్టీ నాయకురాలికి 70 ఏళ్లు దాటి ఉన్నా గుంపులోకి వచ్చి రాళ్లు వేశారంటూ ఫిర్యాదు అందుతుంది. ఎఫ్.ఐ.ఆర్.లో పేరూ నమోదవుతుంది. ఆయనకు నచ్చితేనే ఆ ఊళ్లో ఇల్లు కట్టుకోగలం. నచ్చకపోతే అధికారులు ఇంటి నిర్మాణానికి ఏదో ఒక అడ్డు చెబుతూనే ఉంటారు. ఆయన వాళ్లైతే మాత్రం అనుమతుల్లేకపోయినా ఏ అధికారీ అటు వైపు కన్నెత్తిచూడరు.
2019 ఎన్నికల సమయంలో ఆ పట్టణంలోనే పక్క నియోజకవర్గానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఒక స్వీటు దుకాణం యజమాని ఇల్లు కట్టుకునేందుకు పునాదులకు గుంతలు తవ్వారు. ఇంతలో ఎన్నికలు పూర్తయ్యాయి. మనం ప్రస్తావిస్తున్న నాయకుడు ప్రజాప్రతినిధి అయ్యారు. ఆ స్వీటు దుకాణం యజమానిది ప్రత్యర్థి పార్టీ కావడంతో ఇల్లు కట్టుకోనివ్వనంటూ అడ్డుపడ్డారు.
'మేం రాజీనామా చేయం'- వైఎస్సార్సీపీ నేతలకు వాలంటీర్ల షాక్ - Volunteers Resignation in AP
అనుమతులు ఇవ్వకుండా చేశారు. ఇప్పటికీ ఆ ఇల్లు పునాదుల గుంతల దశలోనే ఉందంటే ఎంతటి కక్షతో ఉండి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా పని ఉండి ఆ ప్రజాప్రతినిధిని కలిస్తే భుజం మీద చనువుగా చెయ్యేసి నవ్వుతూ మాట్లాడతారు. కానీ 'ఏంటోనోయ్ నాకు గాజు గ్లాసులు గుచ్చుకుంటున్నాయి' అని వెటకారమాడతారు. అంటే- ఆయన అంతకుముందు ఎన్నికల్లో జనసేనకు పని చేశాడని అర్థమన్నమాట. అందువల్లే పని జరగదని పరోక్షంగా హెచ్చరిస్తారు.
తనకు ఓటేయని వారికి కార్యాలయాల్లో, పోలీస్‌స్టేషన్లలో ఇతరత్రా ప్రైవేటు వ్యవహారాల్లో పనులయ్యే పరిస్థితి లేకుండా కట్టడి చేశారు. ఆ ప్రజాప్రతినిధి చుట్టూ ఒక ప్రత్యేక బ్యాచ్ ఉంటుంది. అందులో రౌడీషీటర్లూ ఉంటారు. హత్య కేసుల్లో పాత్ర ఉన్న వారి కుటుంబాలవారూ ఉంటారు. సెటిల్‌మెంట్ వ్యవహారం కనీసం అరకోటి మించుతుందంటే చాలు ఆ బ్యాచ్ రంగంలోకి దిగిపోతుంది.
ఈ ప్రజాప్రతినిధి అండతో అందులో కొందరిపై ఉన్న రౌడీషీట్లు మాయమైపోయాయి. ఆ బ్యాచ్ భయపెట్టి, బెదిరించి ఎన్ని సెటిల్‌మెంట్లు చేసినా పోలీసులకు ఏం కనిపించదు, వినిపించదు.! దాంతో వారికి సత్ప్రవర్తన సర్టిఫికెట్లు జారీ చేసి మంచివారిగా ముద్ర వేయించేసుకున్నారు. ఆ ప్రజాపతినిధి నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడి జనసేన గెలుపొందింది.
గెలిచిన వారు సంబరాలు చేసుకోవడం చూసి తట్టుకోలేక హుటాహుటిన తన అనుచరులతో కలిసి సినిమా లెవెల్లో ఆ ఊరికి వెళ్లిపోయారు. ప్రత్యర్థుల ఇళ్లపై దాడులకు దిగారు. దొరికింది దొరికినట్లు ధ్వంసం చేశారు. 'మీ అంతు చూస్తామంటూ అనుచరగణం మధ్యలో ఉండి ఆ ప్రజాప్రతినిధి అరాచకం సృష్టించారు. లోకేశ్ యువగళం యాత్ర నేపథ్యంలో ఆయనపై కిరాయి రౌడీలతో రాళ్ల దాడి చేయించారు.
ఈ సంఘటనలో టీడీపీ నాయకులు, సాధారణ కార్యకర్తలు, పోలీసులు సైతం గాయపడ్డారు. మళ్లీ అవతలివారిదే తప్పు అన్నట్లు కేసులు నమోదు చేయించారు. జగనన్న కాలనీల లేఅవుట్ల కోసం ప్రభుత్వం భూమి సేకరిస్తుందని ముందే ఆ ప్రజాప్రతినిధికి తెలుసు. కొందరు రైతులను భయపెట్టి దాదాపు 70 ఎకరాల భూముల్ని అనుచరులూ, బినామీలతో కొనిపించేశారు.
ఎకరం 35 నుంచి 60 లక్షల రూపాయలకు కొనిపించి ఆనక అదే భూమిని ప్రభుత్వానికి రెట్టింపు ధరకు అమ్మి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. చాలా చోట్ల ఊరు శివార్లలో నివాస యోగ్యం కాని భూములను ఇందుకు ఎంపిక చేసి ఆ భూ యజమానులకూ లబ్ధి కలిగించి వారి నుంచి ప్రయోజనం పొందారు. జగనన్న కాలనీల్లో మట్టి పూడిక పనుల్లో కోట్లలో అవినీతి చేశారు.
ఆ పట్టణం జిల్లా కేంద్రంగా మారాక అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లకు గిరాకీ మరింత పెరిగింది. ఈ ప్రజాప్రతినిధికి ఇదే ప్రధాన వనరుగా మారింది. ఈ ప్రజాప్రతినిధికి ముడుపులు చెల్లిస్తే అనుమతులు లేకున్నా లేఅవుట్ వేసుకోవచ్చు, ప్లాట్లు అమ్ముకోవచ్చు. అనుమతులు లేని లేఅవుట్‌లో ఎకరానికి 5సెంట్ల స్థలం వాటాగా తీసుకుంటారు.
పట్టణంలో కొంత కాలం కిందట ఓ భారీ అనధికారిక లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్‌కు వెళ్లేందుకు బృహత్ ప్రణాళికలో ఉన్న రహదారిని అడ్డగోలుగా ఆక్రమించి, పంట కాలువపై అనధికారిక వంతెన కూడా నిర్మించారు. ఈ మొత్తం వ్యవహారానికి కొమ్ముకాసినందుకు లేఅవుట్లో రెండకరాల స్థలం ముట్టజెప్పారని సమాచారం.
ఆ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాననే భావన కలిగించేలా అటు తనకు ప్రయోజనం కలిగేలా ఒక స్కెచ్ రూపొందించారు. ఎక్కడో దూరంలో ఒక కీలక ప్రభుత్వ వసతి నిర్మాణానికి భూమి ఇచ్చారు. ఈ క్రమంలో పట్టణం నుంచి ఆ శివారుకు వెళ్లే మధ్య ఉన్న ప్రాంతంలో తన వారి భూములకు డిమాండ్ పెంచి మంచి ధరలకు ప్లాట్లు వేసి అమ్మకాలు సాగించారు.
భవనాలకు ప్లాన్ ఇవ్వాలన్నా ఈ ప్రజాప్రతినిధి అనుమతి తీసుకోవాల్సిదే. కప్పం కట్టని నిర్మాణాలపై ఆయన వర్గం నిరంతరం రెక్కీ నిర్వహిస్తుంటుంది. నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నా సెట్‌బ్యాక్స్, పార్కింగ్ వంటి చిన్న చిన్న లోపాలను బూచిగా చూపిస్తారు. సంబంధిత అధికారులతో భవనాలు కూల్చేస్తామంటూ నిర్మాణదారులను బెదిరింపజేస్తారు.
ఈ బాధలు భరించలేక అందరూ ముందే ఆయనతో సెటిల్ చేసుకుంటారు. పట్టణ ప్రణాళికాశాఖ అధికారులు ముందు వెళ్లి ఆయనను కలిసి రండి అని చెబుతారు. అనధికారిక నిర్మాణాలైతే లక్షల్లో వసూలు చేస్తున్నారు. కొందరి దగ్గర ఫ్లాట్‌లు తీసుకుంటారు. పట్టణానికి అనుకుని ఉన్న గ్రామాల్లో వందలాది ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించి బినామీ పేర్లతో అడ్డుగోలుగా ఆక్వా చెరువులు తవ్వారు.
ఆక్వా జోన్ కాకున్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూముల్లో చెరువులు తవ్వుకుని యథేచ్ఛగా ఆక్వా సాగు చేస్తున్నారు. పచ్చని పంట పొలాలు పాడైపోతున్నాయని అక్కడి రైతులు ఆక్రోశిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఐదేళ్లుగా ఈ ప్రాంతంలో ఆయన అనుచరులు యథేచ్ఛగా మట్టి రవాణా నిర్వహిస్తున్నారు. దీని వెనక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి.