YS Sharmila Comments on CM Jagan: విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలలో పాల్గొన్న వైఎస్ షర్మిల వైసీపీపై, సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. నియంతల్లా మారి కొందరు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని వైసీపీ నేతలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ రాష్ట్ర వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా షర్మిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
నియంతల్లా మారిన రీజనల్ పార్టీలు బడుగు బలహీన వర్గాలను సమానంగా చూడటం లేదని విమర్శించారు. ఎవరూ కితాబు ఇవ్వకపోతే తన విలువ ఎక్కువ కాదు, తక్కువ కాదని ఆమె వ్యాఖ్యానించారు. తాను వైఎస్ కుమార్తెను అయినపుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. తన కుమారుడికి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నానని అన్నారు.
జగనన్న వల్లే వైఎస్ కుటుంబం చీలింది: షర్మిల
ఏదో ఆశించి అన్న వద్దకు వెళ్లలేదు: తనకు చాలా దగ్గర మనిషి కొండా రాఘవ రెడ్డి సైతం తానే అడిగి పాదయాత్ర చేసినట్లు మాట్లాడారని షర్మిల పేర్కొన్నారు. కానీ కొండా ఆరోపణలు నిజం కాదని తెలిపారు. కొండా అన్నా మీరు ప్రమాణం చేయగలరా, మీ ఆరోపణలు నిజం కాదు అని నేను ప్రమాణం చేయగలనని షర్మిల సవాల్ చేశారు. అక్రమంగా సంపాదించుకోవడానికి తన భర్తతో జగన్ వద్దకు వెళ్లానని అభాండాలు వేస్తున్నారన్నారు. తాను ఏమీ ఆశించి ఈరోజు వరకూ తన అన్న వద్దకు వెళ్లలేదన్న షర్మిల, దానికి సాక్ష్యం తన అమ్మేనని తెలిపారు. మీకు దమ్ముంటే మా అమ్మను అడగాలన్నారు.
దళితులపై దాడులు వంద శాతం పెరిగాయి: అన్ని వర్గాల వారి కోసం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, ఆయన భారీ విగ్రహాలను ప్రభుత్వాలు పెడుతున్నాయని, సమాజంలో సోషల్ జస్టిస్ వంద శాతం లేదని అన్నారు. భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదని విమర్శించారు. దళితులపై దాడులు వంద శాతం పెరిగిపోయాయని దుయ్యబట్టారు. ఎవరైనా ఎదిరించినా, ప్రశ్నించినా వాళ్లకి గుండు కొట్టి అవమానిస్తున్నారని మండిపడ్డారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల పిలుపునిచ్చారు.
అప్పటి మాటలేమయ్యాయి ? ప్రత్యేక హోదాపై నోరెందుకు విప్పడం లేదు ?: షర్మిల
కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలి: దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినవారిని పక్కన పెట్టుకున్నారని ఆరోపించారు. అంబేడ్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదని, ఆయన ఆశయాలను గొప్పగా అమలు చేయాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులు దారిమళ్లించి సొంత అవసరాలకు వాడుకున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలు బడుగు, బలహీనవర్గాలను సమానంగా చూడటం లేదని అన్నారు. దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
పులి కడుపున పులే పుడుతుంది: అనంతరం కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల, గిడుగు రుద్ర రాజు పాల్గొన్నారు. పులి కడుపున పులే పుడుతుందని, తనది వైఎస్‌ఆర్ రక్తం అని పేర్కొన్నారు.ఎవరు అవునన్నా కాదన్నా తాను వైఎస్ షర్మిలారెడ్డి అని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ పాలనకు, జగన్ పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. వైఎస్‌ఆర్ జలయజ్ఞంపై ఎంతో దృష్టి పెట్టారని, వైఎస్సార్ 17 శాతం నిధులిస్తే జగన్ 2.5శాతమే ఇచ్చారని మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తోంది: హోదా కాదు కదా కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదని ధ్వజమెత్తారు. పోలవరం, హోదా, రాజధాని ఏదీ లేదని, ఉన్నవన్నీ అప్పులేని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25మంది ఎంపీలున్నా రాష్ట్రానికి తెచ్చింది గుండు సున్నా అన్న షర్మిల, స్వలాభం కోసం జగన్ రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ఒక్క సీటు కూడా లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తోందని, వైసీపీ నేతలు కట్టు బానిసలుగా మారారని విమర్శించారు.
వైసీపీ, టీడీపీకి వేసే ప్రతి ఓటు బీజేపీకే పోతుంది - ఆ పార్టీల ఉచ్చులో పడొద్దు: షర్మిల