YS Sharmila Allegations Against YS Jagan: అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయమని జగన్ రెడ్డికి సూచిస్తే తనను చంద్రబాబు ఏజెంట్ అని వైఎస్సార్సీపీ ఆరోపించడంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఇంత మూర్ఖత్వంతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను మ్యూజియంలో పెట్టాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జగన్‌రెడ్డి సహా వైఎస్సార్సీపీ వాళ్లకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని అందుకే గతంలో అద్దంలో చూసుకోమని సలహా ఇచ్చినట్లు గుర్తు చేశారు. సోషల్ మీడియాలో తనను కించపర్చేంత ద్వేషం వైఎస్సార్సీపీ వాళ్లకు ఉన్నా తనకు అలాంటి ద్వేషం లేదన్నారు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉందన్నారు.
ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని షర్మిల నిలదీశారు. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం ఉందన్న షర్మిల అది అధికార పార్టీనా, లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు అని అందుకే తప్పని చెప్పామన్నారు. చట్టసభను గౌరవించకపోవడం తప్పు కావడం వల్లే రాజీనామా చేయమని డిమాండ్ చేసినట్లు చెప్పారు. వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే స్వయంగా అక్కడికి వెళ్లి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించానన్న ఆమె అసలు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలి- మోసాలు ఆయనకు కొత్త కాదు: షర్మిల - YS SHARMILA TWEET ON JAGAN
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈ రోజు వైఎస్సార్‌కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదన్నారు. వైఎస్సార్సీపీలో వైఎస్సార్‌ను, విజయమ్మను అవమానించినవాళ్లే పెద్దస్థాయిలో ఉన్నారని షర్మిల అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీలో వైఎస్సార్‌ని ఎప్పుడో వెళ్లగొట్టారని ఇప్పుడు వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే అని గుర్తుచేశారు. అందువల్ల వైఎస్సార్‌లాగా అసెంబ్లీలో పోరాడటం వైఎస్సార్సీపీ నాయకుల చేతకాదని మీడియా పాయింటే ఎక్కువని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ వాళ్లు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నామని అన్నారు.
తల్లికి వందనంపై మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నేతలకు కోపం ఎందుకు?: షర్మిల
వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రైతులను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, 4 వేల కోట్ల పంట పరిహారం అంటూ మభ్యపెట్టారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌కు ప్రీతిపాత్రమైన జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం అంటూ దగా చేసిన వైఎస్సార్సీపీ నాయకులకంటే మోసగాళ్లు, విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా అని ప్రశ్నలు గుప్పించారు. శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకున్న జగన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విమర్శించారు. వైఎస్సార్ తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అహంకారమే వైఎస్సార్సీపీ పతనానికి కారణమనే విషయం గుర్తించాలని హితవు పలికారు.