YCP Money Distribution To Voters In AP : వివిధ రకాల స్కీములు పేరుతో ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల స్టోరీలు విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ప్రస్తుతం ఏపీలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. ‘పది ఓట్లున్నాయా? లక్ష రూపాయలు ఇచ్చేద్దాం. వంద ఓట్లు వేయించే కార్యకర్తలా రూ. 5 లక్షల రూపాయలు ఇచ్చేయండి. మండల స్థాయి నాయకుడా? కోటి రూపాయలు పెట్టి కొనెేయండి. కాస్త పెద్ద నేతకు నాలుగైదు కోట్ల రూపాయలైనా సరే పర్లేదంటూ వెదజల్లుడు కార్యక్రమం మొదలుపెట్టింది.
కేవలం ఈ కొనుగోళ్ల కోసమే ఏపీలోని 175 నియోజకవర్గాలకు రూ. 9 వేల కోట్ల రూపాయలకుపైగా కుమ్మరించేస్తోంది. సగటున నియోజకవర్గానికి రూ. 45 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలను తరలించి, మండలానికో నాయకుడికి బాధ్యతలు కట్టబెట్టింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ తదితర ముఖ్యనేతలు పోటీ చేసే నియోజకవర్గాలైతే భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఎలాగైనా గెలవాలి, ఎంతకైనా కొనెయ్యాలనే దుష్టవ్యూహాన్ని అమలు చేస్తూ జోరుగా బేరాలు సాగిస్తోంది.
అందులో భాగంగా నియోజకవర్గ నేతల నుంచి గ్రామ, బూత్‌స్థాయి కార్యకర్తల వరకు ఎవరికి ఎంత సొమ్ము ఇవ్వాలో వ్యూహ బృందాలు లెక్కలు వేశాయి. దాన్ని అమలు చేయడం అధిష్ఠానానికి అత్యంత దగ్గరివారైన మండలస్థాయి ముఖ్య నేతల పని. తమకు అప్పగించిన పని పూర్తిచేసేందుకు అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ముందు రోజే వీరు ఆయా మండలాలకి చేరుకున్నారు.
నవ సందేహాలకు సమాధానమివ్వండి - ఏపీ సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల లేఖ - YS Sharmila Letter To CM Jagan
ఏపీలో డబ్బుల పంపిణీ : పార్టీ అధినేతకు ఎంతో నమ్మకంగా ఉన్నవారినే ఈ పనికోసం రంగంలోకి దించారు. వీరిలో కొందరు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్థాయి నేతలు ఉండగా, మరి కొందరు మాజీలున్నారు. డబ్బులు పంపిణీ చేయడంతో పాటు, అభ్యర్థిని సమన్వయం చేసుకుంటూ ఇతర పార్టీల నాయకులతో సైతం బేరాలు సాగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ పనిచేసే అధికారుల్ని ఆదేశించి తమకు కావాల్సిన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోగలిగిన స్థాయి ఈ నాయకులది.
ఒక్కో నాయకుడి ఆధీనంలో మండలానికి రూ. 10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల వరకూ అందుబాటులో ఉంచినట్లు చెబుతున్నారు. అయితే మండలాలకు ముఖ్య నాయకుల రాకపై అక్కడ పట్టున్న పార్టీ నేతలు మాత్రం రగిలిపోతున్నారు. "మా ప్రాంతంలో వారి పెత్తనం ఏమిటి? మా మండలంలో ఎప్పటి నుంచో ఉంటున్న మాకు తెలియకుండా వారు ఎలా రాజకీయం చేస్తారు?’’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అభ్యర్థితో సమన్వయం చేసుకుంటూ : నియోజకవర్గం, మండలం, గ్రామం, కాలనీ, పోలింగ్ బూత్ ఇలా వివిధ స్థాయిల వారీగా ప్రభావం చూపగలిగే ముఖ్య నేతలు, కార్యకర్తల వారీ లిస్ట్‌లను వ్యూహ బృందాలు గతంలోనే సిద్ధం చేశాయి. ఏ ఊళ్లో ఎవర్ని కొనాలి, ఏ నాయకుడికి ఎన్ని లక్షల రూపాయలు ఇవ్వాలి, ముఖ్య కార్యకర్తలకు ఎంత ఇవ్వాలనే మొత్తం లెక్కలూ వేశాయి. వీటి ప్రకారం అభ్యర్థుల్ని సమన్వయం చేసుకుంటూ పోలింగ్ పూర్తయ్యే వరకు అన్ని రకాల కార్యకలాపాలను పర్యవేక్షించడం, తమకు అప్పగించిన పంపిణీ బాధ్యతలను పూర్తి చేయడం ఈ నమ్మిన బంటుల పని. ఇవే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని కొనుగోలు చేయడంలో కూడా వ్యూహ బృందాలు అందించే వివరాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది.
జోరుగా బేరాలు! : ముఖ్యనేతల కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో 3 రోజుల నుంచి బేరాలు జోరందుకున్నాయి. ఎన్డీఏ అభ్యర్థికి పోటీ ఇవ్వలేమంటూ మొన్నటి వరకు ప్రచారానికే ముఖం చాటేసిన ఉత్తరాంధ్ర, కోస్తాలోని కొందరు అభ్యర్థులు సైతం నాలుగైదు రోజులుగా కాస్త దూకుడు మీదున్నారు. మీకేం భయం లేదని, అధికారగణం అండగా ఉంటుందని, ఆపై ఆర్థికంగా తాము చూసుకుంటామంటూ చెబుతున్నారు.
కార్యకర్తలకు 10 లక్షల రూపాయలు : కిందిస్థాయిలోని కార్యకర్తలకు సైతం ఎంత సొమ్ము అందించాలి అనేది ముఖ్యనేతలకు సూచనలు అందాయి. ఒక కాలనీపై పూర్తి ఆధిపత్యం కలిగిన కార్యకర్తలకు 10 నుంచి 15 లక్షల రూపాయలు అందించే అవకాశం ఉందని ఉత్తరాంధ్రకు చెందిన ఒక నాయకుడు వివరించారు. కాలనీలు, వీధుల్లో అధిక ప్రభావం కలిగిన కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు, 20 ఓట్లు వేయించే వారికి లక్ష రూపాయల వరకు సర్దుబాటు చేయాలనే సూచనలు అందాయి. ఎక్కడా చిన్నపాటి అవకాశాన్ని కూడా వదలొద్దని మండలస్థాయి బాధ్యతలు చూస్తున్న ముఖ్యనేతలకు ఆదేశాలు వచ్చాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక అభ్యర్థి బూత్‌లో 250 ఓట్ల మెజార్టీ వస్తే 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం ఆ పార్టీ కొనుగోళ్ల తీరుకు అద్దం పడుతోంది.
ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచే ప్లాన్: రాజకీయాల్లో ఎవరైనా ప్రజల అభిమానం సంపాదించి ఓట్లని అడుగుతారు. కానీ అవినీతి పునాదులపై పుట్టిన ఆ రాజకీయ పార్టీకి నైతికతను ఎలా ఊహించగలం? ప్రజల అభిమానాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలతో వ్యాపారం చేయడమే ఎ‘జెండా’ గా పెట్టుకున్నారు. వారికి ఎన్నికలు సైతం వ్యాపారమే. 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు డబ్బులు పంపిణీతో పాటు ఇతర అవసరాలకు కలిపి చేస్తున్న ఖర్చు సుమారు 15 వేల కోట్ల రూపాయలపైనే. ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచే సభలెలా పెట్టాలి, ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలి, ఎలాంటి తాయిలాలు ఇవ్వాలి అనేది నిర్ణయించారు. అందులో ముఖ్యమైన దశలు ఇలా ఉన్నాయి.
50 కోట్ల రూపాయలను తరలించి అందించే ఏర్పాట్లు : పోలింగ్ బూత్ స్థాయి వరకు కులాల వారీగా ఓటర్ల వివరాల సేకరిస్తారు. ప్రతి 50 మంది బాధ్యతలు ఒకరికి అప్పగిస్తారు. తరచూ వారిని కలిసి ఇప్పటి వరకు కల్పించిన లబ్ధిని వివరిస్తారు. ఎన్నికల్లో కీలకంగా పనిచేసే కొందరిని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మండలస్థాయిలో ఒక్కొక్కరికి 50 నుంచి కోటి రూపాయలు, నియోజకవర్గ స్థాయిలో 5 కోట్ల రూపాయలు, డివిజన్ స్థాయిలో 7 కోట్ల రూపాయలు, జిల్లా అయితే 15 కోట్లు రూపాయలు, రాష్ట్రస్థాయిలో పనిచేసే వారైతే 50 కోట్ల రూపాయలను వారి సొంత ప్రాంతాలకు తరలించి అందించే ఏర్పాట్లు చేశారు.
అభ్యర్థుల ప్రకటన తర్వాత తాయిలాల పంపిణీ, కొందరు వాలంటీర్లు, జర్నలిస్టులు, ఇతర వర్గాలకు నగదుతో కూడిన గిఫ్ట్ ప్యాకెట్లు, ఫోన్లు, చీరలు, గడియారాల, ఇతరత్రాలు అందజేస్తారు. నామినేషన్ల తర్వాత నుంచి ప్రారంభం అవుతుంది. ముఖ్య నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక నియోజకవర్గ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఎక్కడికక్కడే సర్దుబాట్లు చేస్తారు. ఓటుకు 3 నుంచి 5 వేల రూపాయలు, వ్యూహ బృందాల సారథ్యంలో పటిష్ఠ కార్యాచరణ ఉంటుంది. పోలింగ్ సమయంలో ప్రత్యర్థి పార్టీల తరఫున ఏజెంట్లుగా కూర్చునే వారిని సైతం కొనుగోలు చేస్తారు. అవసరమైతే బెదిరించి తరిమేస్తారు.
నియోజకవర్గ నేతలైతే కోటి రూపాయలు : నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ పట్టున్న నేతకు కోటి రూపాయలు, ఒకటి, రెండు, మండలాల్లో ప్రభావం చూపే వారికి 50 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిసింది. గ్రామస్థాయిలో ఆ పార్టీ తరఫున ఒకే వర్గం ఉంటే మేజర్ పంచాయతీలైతే 50 లక్షల రూపాయలు, 2 వేల నుంచి 5 వేల ఓటర్లు ఉన్న పంచాయతీల్లో 20 లక్షల రూపాయలు, 1,000 నుంచి 2 వేల ఓటర్లలోపు ఉన్న పంచాయతీల్లో 15 లక్షల రూపాయలు, 1,000 లోపు ఓటర్లు ఉన్న పంచాయతీల్లో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఓటుకు ఐదువేలు : కోస్తాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆ పార్టీ వెదజల్లుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ప్రకాశం జిల్లాలో ఒక నాయకుడు ఓటుకు 5 వేల రూపాయలైనా ఇవ్వండంటూ మండల, గ్రామ నేతలకు చెబుతున్నట్లు సమాచారం. కీలక నియోజకవర్గాల్లో 10 వేల రూపాయలు సైతం ఇచ్చేందుకూ వెనకాడొద్దని సూచిస్తున్నారు.