Vizianagaram Lok Sabha Constituency: విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం 2008లో పునర్విభజన సమయంలో ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరం సహా నూతనంగా ఏర్పాటైన పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు దీని కిందికి వస్తాయి. ఇది జనరల్ కేటగిరిలో ఉంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఎన్నికల్లో ఓటర్లు టీడీపీకి పట్టంకట్టారు. అయితే అంతకుముందు టీడీపీకి కంచుకోటగా ఉన్న విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయాలు మారిపోయి గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అందలం ఎక్కించాయి. గత వైభవాన్ని తిరిగి పొంది ఈసారి ఎలాగైనా తమ పార్టీ జెండా ఎగురవేయాలని టీడీపీ తహతహలాడుతోంది.
శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు విజయనగరం సంస్కృతికి దర్పణం పడుతుంటాయి. దాదాపు 300 సవంత్సరాలుగా జరుగుతున్న ఈ ఉత్సవాలు విజయనగరానికి వన్నెతీసుకొస్తాయి. విజయనగరం పట్టణం మధ్యలో 'పెద్ద చెరువు' విశాలమైనది. 18వ శతాబ్దంలో కోట నిర్మాణానికి కావల్సిన మట్టి కోసం దీన్ని తవ్వించగా పైడిమాంబ విగ్రహం వెలుగుచూసింది.
లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు
లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
- ఎచ్చెర్ల
- రాజాం(ఎస్సీ)
- బొబ్బిలి
- చీపురుపల్లి
- గజపతినగరం
- నెల్లిమర్ల
- విజయనగరం
2024 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్ల వివరాలు :
- మొత్తం ఓటర్ల సంఖ్య- 15.68 లక్షలు
- పురుషులు - 7.80 లక్షలు
- మహిళలు - 7.88 లక్షలు
- ట్రాన్స్‌జెండర్లు - 92
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 80.98 శాతం పోలింగ్ నమోదైంది. టీడీపీ తరఫున బరిలో దిగిన అశోక్ గజపతిరాజుపై వైఎస్సార్సీపీకి చెందిన బెల్లాన చంద్రశేఖర్ 48,036 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలవగా బీజేపీ, కాంగ్రెస్, జనసేన అభ్యర్థులతో కలిపి మొత్తం 9మంది డిపాజిట్లు కోల్పోయారు.
ప్రస్తుత ఎన్నికలకు బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే: ప్రస్తుతం విజయనగరం పార్లమెంట్ పరిధిలో టీడీపీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎచ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కలిశెట్టి ఆశించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అయితే పొత్తులో భాగంగా ఎచ్చర్ల అసెంబ్లీ స్థానం బీజేపీకి వెళ్లిపోవటంతో కలిశెట్టికి విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని టీడీపీ కల్పించింది.
![Vizianagaram_Lok_Sabha_Constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-04-2024/21239011_vizianagaram_lok_sabha_constituency.jpg)
ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు- సమీప ప్రత్యర్థులు:
- 2009- బొత్స ఝాన్సీ లక్ష్మి(కాంగ్రెస్)- కొండపల్లి అప్పలనాయుడు(టీడీపీ)
- 2014- అశోక్ గజపతి రాజు(టీడీపీ)- రావు వెంకట శ్వేతా చలపతి కుమారకృష్ణ రంగారావు (వైఎస్సార్సీపీ)
- 2019 - బెల్లాన చంద్రశేఖర్(వైఎస్సార్సీపీ)- పూసపాటి అశోక్ గజపతిరాజు(టీడీపీ)