CM Revanth Reddy ON Telangana Formation Day : తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనం కీలక అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలో మాట్లాడారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజన చేస్తున్నామని, హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణ, ఓఆర్‌ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని సబ్ అర్బన్, రీజినల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు గ్రామీణ తెలంగాణ జోన్‌గా విభజిస్తున్నట్లు వెల్లడించారు. మూడు జోన్లలో అభివృద్ధి ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు, .
రాష్ట్ర ప్రజల స్వేచ్ఛపై దాడి జరిగిందని, సామాజిక న్యాయం మేడిపండు చందమైందని అన్నారు. ప్రజల సంపద గుప్పెడు మంది చేతుల్లోకి వెళ్లిందని, తెలంగాణ సంసృతి, సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం ఎన్నికైన ప్రభుత్వం తెలంగాణలో ఉందన్న ఆయన ప్రజా ప్రభుత్వం జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవమని అన్నారు.
'తెలంగాణ ప్రదాత సోనియా గాంధీని ఈ ఉత్సవాలకు మంత్రివర్గం ఆహ్వానించింది. ఏ హోదాలో సోనియాగాంధీని ఆహ్వానించారని కొందరు అడుగుతున్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? తల్లిని ఆహ్వానించేందుకు బిడ్డకు ఒకరి అనుమతి అవసరమా? ఏ హోదాలో, ఏ పదవిలో ఉన్నారని మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తించుకున్నాం? తెలంగాణ చరిత్ర ఉన్నంతవరకూ ఈ సమాజం సోనియాను తల్లిగానే గౌరవిస్తుంది. తెలంగాణ గడ్డతో సోనియాగాంధీది రాజకీయ బంధం కాదు. తెలంగాణతో సోనియాగాంధీకి ఉన్నది పేగు బంధం' అని రేవంత్ రెడ్డి అన్నారు.
అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గేయంగా : తెలంగాణ వచ్చి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదని, ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఉండాలని అంతా అనుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారికంగా గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమయ్యి ఉండేది చిహ్నంలోనే అని తెలిపారు.
"తెలంగాణ అంటేనే ధిక్కారం, తెలంగాణ అంటనే పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో ధిక్కారం, పోరాటం ప్రతిబింబించాలి. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందిస్తున్నాం. ప్రజల ఆకాంక్షల మేరకు టీఎస్‌ను టీజీగా మార్చాం. సగటు గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజన : రాష్ట్రంలో తాలు, తరుగు లేకుండా, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొంటున్నారని తెలిపారు. రూ.7,500 కోట్లను ఖాతాలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. తెలంగాణకు డ్రీమ్ 20-50 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని తెలిపారు. మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని చేపడతామని, సుందరీకరణ ద్వారా పరివాహక ప్రాంతంలో ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు. మూసీ సుందరీకరణకు రూ.వెయ్యి కోట్లు కేటాయించామని చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత : ఎగువన ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉమ్మడి నల్గొండ వరకు సాగునీటి వనరులుగా మూసీ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు తగినట్లు మెట్రో విస్తరణ చేపడతామని స్పష్టం చేశారు. త్వరితగతిన రీజినల్ రింగ్ రోడ్డును పూర్తి చేస్తామని వివరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని ఇచ్చే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, డ్రగ్స్, గంజాయి విషయంలో ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణకు ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.
'అధికారం రాగానే ఆడపడుచులకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10లక్షలకు పెంచుతూ అమల్లోకి తెచ్చాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ ఏడాది 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్ల నిధులు మంజూరు చేశాం. ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ మోడల్ స్కూల్ నిర్మించడం మా బాధ్యత' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.