Political Parties Graduate MLC By Election Campaign 2024 : వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల స్థానంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టభద్రులు, మేధావులు తమ పార్టీ వైపే ఉన్నారన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పార్టీ ముఖ్య కార్యకర్తల భేటీకి, హస్తం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, కోదాడ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, మందుల సామెల్‌తో కలిసి ఉత్తమ్ పాల్గొన్నారు.
తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ హుజుర్‌నగర్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికలో పల్లా రాజేశ్వర్ రెడ్డి బోగస్ ఓట్లతో గెలిచారని ఉత్తమ్ ఆరోపించారు. మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. పట్టభద్రుల ఓటర్లను స్వయంగా కలిసి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు.
"కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. పట్టభద్రుల ఓటర్లను స్వయంగా కలిసి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేయాలి. మల్లన్నకు హుజుర్‌నగర్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ రావాలి." - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి
Telangana Graduate MLC Elections 2024 : సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన తుంగతుర్తి నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో, మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి , మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. తనను ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే వేతనం తీసుకోకుండా పేద విద్యార్థుల సంక్షేమానికి సేవ చేస్తానని రాకేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు కావాల్సింది ధిక్కారస్వరం వినిపించే వాళ్లే కానీ, అధికార స్వరం వినిపించేవాళ్లు కాదని జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రశ్నించే తత్వం ఉన్న రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ : రాకేశ్‌రెడ్డికి మద్దతుగా ఆలేరులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. శాసనమండలికి ఎవరిని పంపాలో పట్టభద్రులు ఆలోచించాలన్నారు. చదువుకుని గోల్డ్ మెడల్ సాధించిన రాకేశ్‌రెడ్డి ఎమ్మెల్సీగా కావాలా?, లేక బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తులు ఎమ్మెల్సీగా కావాలా మీరే నిర్ణయించుకోవాలని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
BJP Campaign in Graduate MLC Elections : బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మద్దతుగా ములుగులో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. విద్యార్థి సంఘం నాయకునిగా ఉద్యమాల్లో పాల్గొని, సమస్యల పరిష్కారానికి పోరాటం చేసిన ప్రేమేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో కమలం పార్టీ నేత ఈటల రాజేందర్ పర్యటించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన, పట్టభద్రులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి పట్టం కట్టాలని ఈటల కోరారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలన మారలేదు : ఈటల రాజేందర్ - Etela Rajender Comments on Congress