MP Candidates Voting Constituencies : అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు తమ ఓటు వారికి వేసుకోలేకపోయారు కారణం వేరే ప్రాంతాల్లో ఓటు ఉండటం. దీంతో వారు తమ ఓటును ఇతర అభ్యర్థులకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి పునరావృతం కానుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇతర నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇతర పార్టీలకు, మరికొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీకి ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తోంది.
అయితే కొందరు అభ్యర్థులు మాత్రం తమ ఓటును తాము వేసుకోలేకపోతున్నామని చిన్నపాటి అసంతృప్తి చెందుతున్నారు. ఎవరైనా తాను పోటీ చేసిన నియోజకవర్గంతో తన ఓటు తనకే వేసుకుంటే ఆ అనుభూతిని పొందాలి అనుకుంటారు. కానీ కొందరు నేతలకు మాత్రం ఈ అవకాశం లేకుండా పోయింది. మరోవైపు తాము పోటీ నియోజకవర్గంలో తాము ఓటు వేస్తే ప్రజల్లో కొంతమేర ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు.
'దేఖో అప్నా దేశ్'లో ఓటేద్దాం - మన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం! - Dekho Apna Desh 2024
తన ఓటును తనకు వేసుకోలేకపోతున్న అభ్యర్థులు : హైదరాబాద్ ఎంపీ, అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ నివాసం రాజేంద్రనగర్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతం చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తుంది. ఇక్కడ ఎంఐఎం పార్టీ నుంచి ఎవరూ ఎన్నికల్లో నిలబడటం లేదు. ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందే.
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఇళ్లు ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్‌లో ఉంది. కంటోన్మెంట్ అసెంబ్లీ ఓటరు లిస్టులో ఆమె పేరుంది. అది మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోకి వస్తుంది. దీంతో తన ఓటును తనకు వేసుకోలేకపోతున్నారు.
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునితా మహేందర్‌రెడ్డికి తాండురు అసెంబ్లీ పరిధిలో ఓటు ఉంది. ఆ ఊరు చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో తన ఓటును తాను వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
హైదరాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్‌కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజవర్గం పరిధిలో ఓటు ఉంది. ఈ సెగ్మెంట్ సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. దీంతో ఈయన సైతం తన ఓటును తనకు వేసుకోలేరు.
చేవేళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు ఉంది. ఇది మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోకి రావడంతో తన ఓటును వేరే వారికి వేయాల్సిన పరిస్థితి.