Telugu States Chief Ministers Meeting : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి శనివారం కీలకమైన సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి సమావేశమవనున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు విభజన వ్యవహారాల విభాగం అవసరమైన సమాచారం, వివరాలు సిద్ధం చేస్తోంది. ఆయా శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల అంశం ప్రస్తావనకు రానుంది. వీటిపై గతంలో పలు దఫాల్లో, వివిధ స్థాయిలో చర్చలు జరిగాయి. కొన్నింటిపై రెండు రాష్ట్రాలకు అంగీకారం కుదరగా కీలకమైన ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ లాంటి వాటిపై ఏకాభిప్రాయం రాలేదు. తొమ్మిదో షెడ్యూల్‌లోని కార్పోరేషన్లు, సంస్థల విషయంలో హెడ్ క్వార్టర్స్ పదానికి నిర్వచనం విషయంలో రెండు రాష్ట్రాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. పదో షెడ్యూల్‌లోని సంస్థలకు స్థానికత ప్రాతిపదిక అయినప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు.
ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ - ఆ అంశాలపై చర్చ! - Two Telugu States CMs Meet
హైదరాబాద్ నగరంలోని భవనాలు, క్వార్టర్స్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. లేక్ వ్యూ అతిథి గృహం, సీఐడీ కార్యాలయం, హెర్మిటేజ్ కాంప్లెక్స్ ఏపీ అవసరాల కోసం కేటాయించారు. జూన్ రెండో తేదీతో పదేళ్లు పూర్తైనందున వాటిని స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో అధికారులను ఆదేశించారు. అయితే ఇంకా విభజన సమస్యలు పూర్తిగా కొలిక్కి రానందున ఆ భవనాలను తమకు కొనసాగించాలని ఏపీ కోరుతోంది. మినిస్టర్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కూడా కొన్ని ఏపీకి కేటాయించారు.
విద్యుత్ బకాయిలపై ఇరు రాష్ట్రాల భిన్న వాదనలు : స్థానికత, ఐచ్చికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం చాలా రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉంది. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశంతోపాటు పౌరసరఫరాలశాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశం కూడా ప్రస్తావనకు రానుంది. విద్యుత్ బకాయిల అంశం కూడా రెండు రాష్ట్రాల మధ్య చాలా రోజులుగా ఉంది. తమకు బకాయిలు రావాలని రెండు రాష్ట్రాలు గణాంకాలతో సహా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశం కూడా ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావనకు రానుంది.
ఐదు గ్రామపంచాయతీల విలీనంపై చర్చా : భద్రాచలాన్ని ఆనుకొన్ని ఐదు గ్రామపంచాయతీల విలీనం అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది. ఏపీలో విలీనమైన ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను స్థానికంగా ఉన్న ఇబ్బందులు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని భద్రాచలంలో కలపాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. గతంలోనే ఐదు పంచాయతీలు తీర్మానాలు కూడా చేశాయి.
ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ విషయమై సానుకూల నిర్ణయం తీసుకొని ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. తుమ్మల లేఖ నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టాలని, వివరాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఐదు గ్రామపంచాయతీలకు సంబంధించి రెవెన్యూ శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది.