Telangana Cabinet Expansion Problem : రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణపై గత కొంతకాలంగా కసరత్తు కొనసాగుతోంది. కానీ కొలిక్కి రావడం లేదు. ఏఐసీసీ స్థాయిలో కసరత్తు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలమైన వారికే క్యాబినెట్‌లో చోటు కల్పించాల్సి ఉంటుంది. అలా జరిగినప్పుడే ఇబ్బందులు లేకుండా పాలన కొనసాగుతుంది. మొత్తం శాసన సభ్యుల సంఖ్యలో 15 శాతం మాత్రమే మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితోపాటు 12 మంది మంత్రి వర్గంలో ఉన్నారు. మరో ఆరుగురికి మాత్రమే మంత్రి వర్గంలో చోటు దక్కుతుంది. అయితే మంత్రివర్గంలో చోటు కోసం పోటీ పడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య చాంతాడంత ఉంది.
అందులో ప్రధానంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ రావులు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న వారిలో ముఖ్యులుగా ఉన్నారు.
ఆరుగురికి మాత్రమే మంత్రి పదవులు : తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రి పదవులు వస్తాయి. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రెడ్డి సామాజిక వర్గానికి చెంది బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలకు మంత్రి పదవులు ఇవ్వాలని పీసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రి వర్గంలో చోటు గ్యారంటీ అని చెబుతున్నారు. మైనారిటీ కోటా కింద ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్ అలీఖాన్‌కు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
నాలుగు మంత్రి పదవులు భర్తీ అయితే మిగిలినవి రెండు మంత్రి పదవులు మాత్రమే ఉంటాయి. ఈ రెండింటిలో ఒకటి లంబాడీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉండగా మరొకటి మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అదిలాబాద్ జిల్లాకు ఒక్క మంత్రి కూడా లేకపోవడంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రిని ఇస్తామని ఏఐసీసీ హామీ ఇచ్చింది. కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఏఐసీసీ ఒత్తిడి తెస్తోంది.
సీఎంకు విచక్షణ కలిగిన వాళ్లకే పదవి? : ముఖ్యమంత్రికి విశ్వాసం కలిగిన వాళ్లకు మాత్రమే మంత్రి వర్గంలో స్థానం కల్పించి సజావుగా పాలన కొనసాగేట్లు చూసుకుంటారు. ఇది సీఎంకు ఉన్నవిచక్షణాధికారంగా చెప్పవచ్చు. కానీ పార్టీ పరంగా సీఎంపై ఒత్తిడి పెరుగుతుండడంతో తాను ఎవరికి పదవి ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలన్న దానిపై మేథోమథనం జరుగుతున్నట్లు తెలుస్తోంది.