Tdp leaders fire : ప్రజల తీర్పును అవమానపరిచేలా జగన్ ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి మండిపడ్డారు. జగన్ ఇంకా తీరు మార్చుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు. జగన్ పాలనపై జనం ఎంతగా ఉడికిపోయారో ఓటింగ్ శాతాలే చెప్పాయన్న ప్రత్తిపాటి ఘోరపరాభవం తర్వాత ముఖం చెల్లకే జగన్ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌కు 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు మంచివి, ఇప్పుడు చెడ్డవా? అని ప్రశ్నిస్తూ జగన్ ఇకనైనా హుందాగా ఓటమిని అంగీకరించాలని హితవు పలికారు.
జగన్ ఇప్పటికీ భ్రమల్లో బతుకుతున్నారు: బుద్దా వెంకన్న - TDP Leader Buddha Venkanna
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలపై గతంలో జగన్ ఏం మాట్లాడారో చూసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంలపై జగన్ గత వ్యాఖ్యల వీడియోను విడుదల చేశారు. ప్రజల సొమ్ము దోచేసి జగన్ రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టించుకున్నారని, ప్రజాధనం దోచుకున్నవాళ్లను ఎవరినీ వదిలిపెట్టేది లేదని కేశినేని స్పష్టం చేశారు. తిన్న సొమ్మంతా కక్కించేలా చట్టాన్ని తయారుచేయాలన్న ఆయన.. ప్రజాధనం దోచుకున్న వారి చిట్టా బయటపడటం ఖాయమని చెప్పారు. జగన్ వల్ల ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇబ్బందిపడ్డారని, జైలు జీవితం కోసం జగన్ ఎదురుచూడటమే తరువాయి అని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
దుర్మార్గాలు, దమనకాండలపై పోరాడిన నాయకులు- వరించిన మంత్రి పదవులు - TDP Leaders Minister Posts
జగన్‌కు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా? మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా? అని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సూటిగా ప్రశ్నించారు. జగన్ పులివెందులకు రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలి.. బ్యాలెట్ పేపర్ విధానంలో ఉపఎన్నిక పెట్టాలని అందరం ఈసీని కోరదాం.. జగన్‌కు మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో.. రాదో చూద్దాం అని సవాల్ చేశారు. ఇకనైనా జగన్ చిలక జోస్యం ఆపాలి అని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్ ట్వీట్‌పై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఏపీ ఎలన్ మస్క్‌లా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా? అని సూటిగా ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు జగన్ ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని, ఆత్మ స్తుతి.. పర నింద మాని ఇకనైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి హితవు పలికారు.