TDP leader Chandrababu fire on YSRCP : రాష్ట్రంలో 5 ఏళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వ్యవస్థల విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలయ్యిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజ్యాగబద్ధ సంస్థ అయిన సర్వీస్ కమిషన్ (Service Commission)ను కూడా రాజకీయ లబ్ధికి, అక్రమాలకు వేదిక చేసి సీఎం జగన్ రెడ్డి లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని ఆయన మండిపడ్డారు. ఎపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాలు, కుట్రలకు నిరుద్యోగ యువత బలయ్యిందని అన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో మునుపెన్నడూ లేని వివాదాలు ఎందుకు తలెత్తాయని, వాటికి కారణాలు ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
మూడు పార్టీల పొత్తు జగన్ను ఓడించడం కోసమే కాదు - రాష్ట్రాన్ని గెలిపించడం కోసం : చంద్రబాబు
డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకన అంటూ మోసపూరిత చర్యలతో రాజకీయ మూల్యాంకనానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వారిని పోస్టింగుల్లో కూర్చోబెట్టుకునేందుకు గ్రూప్ 1 పోస్టులను అమ్ముకుని అర్హులైన వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అక్రమాలకు పాల్పడి సర్వీస్ కమిషన్ ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీశారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ(APPSC)ని రాజకీయ పునారావాస కేంద్రంగా మార్చిందని, ఖాళీల భర్తీలో అక్రమాలకు పాల్పడడమే కాకుండా మూల్యాంకనం విషయంలో హైకోర్టును సైతం తప్పు దోవ పట్టించే ప్రయత్నం విస్మయం కలిగించిందని మండిపడ్డారు. ఈ అక్రమాల వెనుక ఉన్న సర్వీస్ కమిషన్ పెద్దల పాత్ర నిగ్గుతేలాలంటే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం బాగు కోసమే పొత్తు - ప్రజలు గెలవాలంటే వైఎస్సార్సీపీ పోవాల్సిందే: చంద్రబాబు
ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న గౌతమ్ సవాంగ్, సంస్థ కార్యదర్శిగా పనిచేసిన మరో ఐపీఎస్ (IPS) సీతారామాంజనేయులును తక్షణమే సస్పెండ్ చేయాలని, ఇద్దరిపై కేసు నమోదు చేసి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముమ్మాటికి ప్రభుత్వ పెద్దల అక్రమాల వల్లనే పరీక్షల రద్దు జరిగిందని అన్నారు. సీబీఐ విచారణ జరిపితే ఉన్నతాధికారుల పాత్రతో పాటు, సూత్రధారులైన ప్రభుత్వ పెద్దల అక్రమాలు కూడా వెలుగుచూస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. అటు జాబ్ క్యాలెండర్ రాక, ఇటు ప్రైవేటు సెక్టార్ లో ఉద్యోగాలు లేక తీవ్ర నిరాశలో ఉన్న యువత తాజా అక్రమాలతో పూర్తిగా నిస్తృహలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల మంది విద్యార్థులు ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని, వారి ఆశలను జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
తెలుగుదేశం టికెట్ ఆశావహులు వీరే, రెండో జాబితా కోసం నేతల ఎదురుచూపులు