TDP chief Chandrababu criticized YCP: రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే ఎన్డీయేతో జట్టుకట్టామని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సైకో జగన్ పోతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. టీడీపీ ఆవిర్భవించి నేటికి 42 ఏళ్లు పూర్తి అయిందని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా బనగానపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఒక మహనీయుడు శుభమూహూర్తాన పెట్టిన పార్టీ తెలుగుదేశమని గుర్తు చేశారు. క్రీస్తుశకం ఏవిధంగా ఉందో, తెలుగుజాతికి తెలుగుదేశం శకం కూడా అంతేనని తెలుగుదేశం పూర్వం, తెలుగుదేశం తర్వాత అని తెలుగుజాతి గుర్తుకుపెట్టుకుంటారని, చంద్రబాబు తెలిపారు.
ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ పేదవారికి ఇవ్వాలని టీడీపీని ఏర్పాటు చేశారని చంద్రబాబు చెప్పారు. కేజీ బియ్యం 2 రూపాయలకే ఇచ్చిన ఘనత టీడీపీదేనని, రైతులకు సాగునీటి కోసం అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని, కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఆలోచన చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అన్ని వర్గాలకు సంక్షేమం అందించారని పేదవారికి, వృద్ధులకు 30 రూపాయలతో పెన్షన్ ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీయే అని తెలిపారు. వెనుకబడిన వర్గాలను రాజకీయ, సామాజిక, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లామని జాతీయస్థాయిలో ఏ పార్టీకి దక్కని గౌరవం టీడీపీకి దక్కిందని వెల్లడించారు.
రాష్ట్రవిభజన తర్వాత అనేక సమస్యలు వచ్చాయి. సమస్యల నుంచి పరిష్కారం చూపించే బాధ్యత టీడీపీ తీసుకుందని తెలిపారు. నదుల అనుసంధానం కోసం పెద్దఎత్తున కార్యక్రమాలు చేశాం. పోలవరంను 72శాతం పూర్తిచేశాం. గోదావరి నీటిని రాయలసీమకు తీసుకురావాలనేది మా సంకల్పం. పెట్టుబడులు పెద్దఎత్తున తీసుకువచ్చాం. కియా పరిశ్రమను పేద జిల్లా అనంతపురానికి తీసుకువచ్చిన ఘనత టీడీపీది. అమరావతిపై నిన్న కూడా సైకో మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు చేశానని మాట్లాడుతున్నారు. కర్నూలు అభివృద్ధి అయిపోయిందా? మూడు ముక్కలాటతో మనకు చిరునామా లేకుండా చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడం, వచ్చిన సంపద పేదవారికి పంచాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాం. చంద్రబాబు, టీడీపీ అధినేత
రాష్ట్రంలో జోరందుకున్న ప్రచారం - హామీలు ఇస్తున్న పార్టీలు - All Parties Election Campaign
జగన్ రెడ్డి పాలనలో అందరూ నష్టపోయారు. రైతులు బాగుపడలేదు, సబ్సీడీలు రావడం లేదని చంద్రబాబు ఆరోపించారు. గిట్టుబాటు ధర లేదు, పొలాలకు నీరు లేదు, మహిళలకు రక్షణ లేదు, నిత్యావసర ధరలు పెరిగాయి. ఇచ్చేది పది, దోచేది వంద. ఫ్యాన్ ను చిత్తుచిత్తు చేసేందుకు యువత ఉత్సాహం చూపిస్తోంది. పెట్టుబడులు రాలేదు, యువతకు ఉద్యోగాలు రాలేదు. మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్ మేం చూసుకుంటాం. కూలీలకు ఉపాధి లేదు, భవన నిర్మాణ కార్మికులకు పనిలేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు కార్పోరేషన్ నిధులు ఇవ్వలేదు, రూపాయి సబ్సీడీ ఇవ్వలేదు. ఏ ఒక్కరికి సాయం చేయలేదని చంద్రబాబు ఆరోపించారు.
ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని నాశనం చేసిన చరిత్రహీనుడు జగన్ రెడ్డి అని చంద్రబాబు విమర్శించారు. రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప జగన్ రెడ్డికి ఏమీ తెలియదని ఆరోపించారు. బుగ్గరు నిమిరి, ముద్దులు పెట్టి ఒక్క ఛాన్స్ అన్నావు, తండ్రి లేని బడ్డన్నావు, చిన్నాన్నను చంపేశావు. చెల్లెల్ని జైలుకు పంపాలని చూస్తున్నారు. దోషులను పక్కనపెట్టుకుని తిరుగుతున్నారు. వారికే సీటు ఇచ్చి వారి ఆత్మను క్షోభపెట్టడం న్యాయమా? ఉమ్మడి కర్నూలుకు జగన్ చేసిందేమీ లేదు. ఎన్నికల ముందు బాబాయి గొడ్డలిపోటు, కోడికత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు కంటైనర్ లో అవినీతి డబ్బులు అంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు. క్వార్టర్ బాటిల్ చూస్తే గుర్తుకువచ్చేది జగన్ రెడ్డి దోపిడీ. 60 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ రూ.200 అయింది. రూ.140 తాడేపల్లి కొంపకు పోతున్నాయి. జనం రక్తం తాగే జలగ జగన్ రెడ్డి. ప్రజల ఆరోగ్యం పాడుచేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
నందికొట్కూరులో మెగా సీడ్ ఫ్యాకర్టీని తీసుకువస్తే అదీ పోయిందని చంద్రబాబు విమర్శించారు. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్క్ పెడితే రద్దు చేశారు. మనది విజన్, జగన్ ది పాయిజన్. నాశనం చేయడంలో దిట్ట. కర్నూలు, ఓర్వకల్లులో 90 కోట్లతో విమానాశ్రయం కట్టాం. జగన్ రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడు. నువ్వు కట్టలేవు, ఎవరో కట్టినదానికి రిబ్బన్ కట్ చేస్తావు, నీ రంగేసుకుంటావు. దానికి కాదు మీ ముఖానికి వేసుకోవాలి రంగు. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏర్పాటుచేద్దామనుకున్నాం. 6 వేల కోట్లతో సోలార్ పార్క్ లు ఏర్పాటుచేసి 5వేల మందికి ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు గుర్తు చేశారు.