TDP ELECTION CAMPAIGN : టీడీపీ అధిష్ఠానం ప్రకటించిన తొమ్మిది మంది గెలుపు గుర్రాలు తమ సత్తా చూపించేలా ప్రచార వేగాన్ని పెంచాయి. తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాలో రెండు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, పొత్తులో భాగంగా ధర్మవరం బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిని కూడా నిర్ణయించాల్సి ఉంది.
జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం - అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీ
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. అనంతపురం జిల్లా శింగనమల అభ్యర్థి బండారు శ్రావణి అసమ్మతి నేతలందరినీ కలుపుకొని ప్రచారంతో ముందుకు పోతున్నారు. శింగనమల ఎస్సీ నియోజకవర్గంలో బండారు శ్రావణి 2019 ఎన్నికల్లో ఓటమి చెందాక, టీడీపీ అధిష్ఠానం అక్కడ ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆలం నర్సానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో బండారు శ్రావణికి మరోసారి పార్టీ అధిష్ఠానం టికెట్ కేటాయించడంతో ద్విసభ్య కమిటీ సభ్యులను కలుపుకొని ప్రచారం వేగవంతం చేశారు. తాడిపత్రిలో ఈసారి ఎన్నికల్లో మరోసారి జేసీ అస్మిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఐదేళ్లుగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమాలు అడ్డుకోవడమే కాకుండా వందకు పైగా అక్రమ కేసుల బాధితుడిగా పోరాటం చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలను కాపాడుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికే మరో సారి టికెట్ కేటాయించారు. తండ్రీ, కుమారులు తాడిపత్రి నియోజకవర్గంలో ప్రతి ఇంటి గడపకు వెళ్లి టీడీపీ తరఫున ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా జనంలోకి టీడీపీ అభ్యర్థులు- వైసీపీలో కొనసాగుతున్న వలసలు
కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వరనాయుడు, హన్మతరాయచౌదరి కుటుంబాలను కాదని అమిలినేని సురేంద్రబాబుకు టికెట్ కేటాయించారు. అక్కడ టీడీపీ కార్యకర్తలతో రోజువారీ సమావేశాలు నిర్వహిస్తూ సురేంద్రబాబు గ్రామాల్లో ప్రచారంతో దూసుకుపోతున్నారు. సురేంద్రబాబు సతీమణి రమాదేవి, ఆయన కుమారుడు యశ్వంత్ వేర్వేరు గ్రామాలకు వెళ్లి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రాయదుర్గం టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యాక కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో మరోసారి కాలవ శ్రీనివాసులునే అభ్యర్థిగా ప్రకటించడంతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కాలవ శ్రీనివాసులు కుమారుడు భరత్ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ తన తండ్రిని గెలిపించాలని ఓటు అభ్యర్థిస్తున్నారు. ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (TDP MLA Payyavula Keshav) కు పార్టీ అధిష్ఠానం మరోసారి టికెట్ ఇచ్చింది. పయ్యావుల కేశవ్ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. కేశవ్ కుమారులు విక్రమసింహ, విజయసింహ వేర్వేరుగా గ్రామాలకు వెళ్లి తన తండ్రిని మరోసారి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
అధికారిక ప్రకటనే ఆలస్యం - టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే !
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీతకు మరోసారి పార్టీ టికెట్ కేటాయించడంతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైఫల్యాలు, అక్రమాలపై ప్రజలకు వివరిస్తూ ప్రచారంతో ముందుకు పోతున్నారు. పరిటాల సునీతకు గ్రామాల్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. పెనుకొండలో సవితకు పార్టీ టికెట్ కేటాయించడంతో ప్రచార వేగాన్ని పెంచారు. ఐదేళ్లుగా ప్రజల్లో ఉంటూ, పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన సవితను చంద్రబాబు నాయుడు గుర్తించి ఈసారి టికెట్ కేటాయించారు. సవిత పెనుకొండ నియోజకవర్గంలో ప్రచార షెడ్యూల్ తో ముమ్మరంగా పర్యటనలు చేస్తున్నారు. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి (Palle Raghunatha Reddy) కోడలు పల్లె సింధూరరెడ్డికి ఈసారి పార్టీ అధిష్ఠానం టికెట్ కేటాయించడంతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పల్లె రఘనాథరెడ్డి, ఆయన కుమారుడు పల్లె కృష్ణ కిశోర్ రెడ్డి వేర్వేరుగా సింధూర రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.
కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఐదేళ్లుగా ప్రజల్లోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ, కార్యకర్తలకు అండగా నిలిచారు. దీంతో ఈసారి కందికుంట ప్రసాద్ సతీమణి కందికుంట యశోదా దేవిని కదిరి అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె ఎండను సైతం లెక్కచేయకుండా గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ లో రాష్ట్రంలో నాలుగో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో టీడీపీ అభ్యర్థులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచార సామగ్రిని సమకూర్చుకోవడంలో నిమగ్నమయ్యారు.
వైసీపీ కుట్రలను అడ్డుకోవడంలో పౌరులు బాధ్యత తీసుకోవాలి- సీవిజిల్ యాప్ సద్వినియోగం చేసుకోవాలి