TDP Activist Murder in Anantapur : అనంతపురం జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లో రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన ఆదెప్ప(50)ను ప్రత్యర్థులు కత్తితో విచక్షణా రహితంగా నరికి గ్రామ శివారులో పడేశారు.
గ్రామంలో కక్షలు : ఏడాదిన్నర కిందట గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఓ వర్గం గ్రామంలో లేని సమయంలో మరో సామాజిక వర్గం వారు ప్రత్యర్థుల ఇళ్లలోకి దూరి మహిళలపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నాడు అధికార వైఎస్సార్సీపీ నాయకులు బాధితులైన 16 మంది టీడీపీ వర్గీయులపైనే కేసు నమోదు చేయించారు. దీంతో గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన 16 మందిని రిమాండ్‌కు తరలించారు.
10 మంది వైఎస్సార్సీపీ వర్గీయులపై ఫిర్యాదు చేసినా కేసు నమోదులో పోలీసులు వివక్ష చూపినట్లు అప్పట్లో గ్రామస్థులు ఆరోపించారు. చివరకు, వైఎస్సార్సీపీ మద్దతుదారులపై తక్కువ తీవ్రత గల సెక్షన్‌లతో కేసు పెట్టారు. అప్పటి నుంచి గ్రామంలో కక్షలు పెరగ్గా, ఎన్నికలు ముగిసే వరకు పోలీసుల పికెట్ కొనసాగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ, తర్వాత రెండు నెలల్లోపే ఈ దారుణం జరగడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.
తాడిపత్రిలో తెలుగుదేశం కార్యకర్త దారుణహత్య- కొడవలితో నరికి చంపిన దుండగులు - TDP Activist Murder
ఆలయ పునఃప్రారంభంలో ఆదెన్న కీలకం : గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయ అర్చకత్వంపై రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దాదాపు మూడు సంవత్సరాలుగా దేవాలయంలో ఇతరులు పూజలు చేయడంతో గ్రామంలో కక్షలు పెరిగాయి. అర్చకులు కొందరు గ్రామస్థుల మద్దతుతో కోర్టుకు వెళ్లారు. కోర్టు అర్చకులకు అనుకూలంగా రెండు సంవత్సరాల కిందటే తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ వైఎస్సార్సీపీ వర్గీయులు అడ్డుకోవడంతో అర్చకులు దేవాలయం వైపు వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది.
ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో రెండ్రోజుల కిందట అర్చకులు దేవాలయం తలుపులు తెరిచి యథావిధిగా పూజాదికాలు కొనసాగిస్తున్నారు. ఆలయ పునఃప్రారంభంలో ఆదెన్న కీలకంగా వ్యవహరించారు. మెచ్చిరి గ్రామం కర్ణాటకకు ఆనుకుని ఉంటుంది. ఆదెన్న వ్యక్తి గత పని మీద మంగళవారం ద్విచక్ర వాహనంపై కర్ణాటకకు వెళ్లారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో కుటుంబీకులతో ఫోనులో మాట్లాడినట్లు బంధువులు చెబుతున్నారు.
జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారు: లోకేశ్
టీడీపీలో క్రియాశీలకంగా ఆదెన్న : రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొలకాల్మూర్ తాలూకా పేదారగుడ్డం (హుచ్చంగి దుర్గం) వెళ్లే దారిలో ఆదెప్ప మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాయదుర్గం పట్టణ సీఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చెరుకొని పరిశీలించారు. తల, చేతులు, పొట్ట, ఛాతీ తదితర భాగాలపై కత్తి పోటు ఆనవాళ్లు కనిపించాయి. ద్విచక్ర వాహనం కూడా పక్కనే వదిలి వెళ్లడంతో కర్ణాటకలో హత్య చేసి గ్రామ శివారులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదెన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ టీడీపీలో క్రియాశీలకంగా పని చేసేవారు.