AP CM Jagan Election Campaign : ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోనూ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. గతంలో అధికారిక పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, విద్యాసంస్థల బంద్ ప్రకటించగా, తాాజాగా విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ నుంచి రోడ్ షో ప్రారంభం కానుండగా అధికారులు తీసుకున్న విద్యుత్ కోత నిర్ణయంపై ప్రజలు మండిపడుతున్నారు. ఉదయం నుంచే కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పర్యటన కోసం చెట్లు నరికివేత : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వస్తున్నారంటే పచ్చని చెట్లైనా, విద్యుత్ తీగలైన నేల కొరగాల్సిందే. సిద్ధం కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో జాతీయ రహదారి 42 పై ఉన్నబత్తలపల్లి , ముదిగుబ్బ మండలాల్లో విద్యుత్ తీగలను తొలగించేశారు. ఇదే మార్గంలోని తనకల్లులో రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలను తెగ నరికేస్తున్నారు. వేసవికాలంలో రహదారికి అనుకుని ఉన్న చెట్ల నీడన ప్రయాణికులు సేద తీరేవారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన పుణ్యమా అని పచ్చని చెట్ల కొమ్మలను నరికేస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trees cut down in Jagan Election Campaign : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ముదిగుబ్బ నుంచి ప్రారంభమయ్యే రోడ్ షో కదిరి మండలం పట్నం వద్ద కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. పట్టణంలోని వేమారెడ్డి కూడలి నుంచి కౌలేపల్లి వరకు జాతీయ రహదారి 42 మీదుగా సీఎం రోడ్ షో కొనసాగనుంది. సాయంత్రం మదనపల్లి రోడ్డు లోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగే ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం తనకల్లు మండలం చీకటిమానిపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో ముఖ్యమంత్రి బసచేయనున్నారు.
ఏపీ సీఎం రోడ్ షో దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా అధికార వైఎస్సార్సీపీ నాయకులు వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు, జాతీయ రహదారి పైన విచ్చలవిడిగా ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇంటి మీద జెండాను కట్టుకుంటేనే తొలగిస్తున్న అధికారులు వైఎస్సార్సీపీ పట్ల స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారంటూ విమర్శించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
People Angry on AP Cm Jagan : ఏపీ సీఎం జగన్ రాకతో కరెంటు సరఫరా కట్ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి ముదిగుబ్బలో సోమవారం సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర చేపట్టారు. సీఎం రాక సందర్భంగా బత్తలపల్లి ముదిగుబ్బలో అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఉదయం నుంచే కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో బత్తలపల్లి ముదిగుబ్బ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి బత్తలపల్లికి చేరుకోక ముందే కరెంటు సరఫరా నిలిపేశారు ముదిగుబ్బలో ఏకంగా రహదారి పక్కన ఉన్న కరెంటు స్తంభాలకు తీగలు కట్ చేశారు. సీఎం ఎన్నికల ప్రచారానికి వస్తే కరెంట్ సరఫరా బంద్ చేయడం ఏమిటి అని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం గారూ న్యాయం చేయండి గోపాల మిత్రల వేడుకోలు : 20 ఏళ్లుగా గోపాలమిత్రలుగా పనిచేస్తున్నాం. గత ఎన్నికల ముందు న్యాయం చేస్తామని మీరే చెప్పారు ఇకనైనా న్యాయం చేయండి అని సత్య సాయి జిల్లా బత్తలపల్లి లో గోపాల మిత్రలు సీఎం జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. సత్యసాయి జిల్లాలోని గోపాలమిత్ర సంఘం నాయకులు గోపాలమిత్రలు బత్తలపల్లి లో సీఎంను కలిసేందుకు వచ్చారు. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వారిని మొదట పోలీసులు సీఎం సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. గోపాల మిత్రల కేకలు విని బస్సు నుంచి కిందకు దిగి వారితో వినతి పత్రాన్ని ఏపీ సీఎం స్వీకరించారు.
ఎన్నికల వేళ మళ్లీ జనం బాట పట్టిన జగన్ - ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర - Lok Sabha Elections 2024