Political Heirs in AP Elections : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వారసులు ఎంతో మంది బరిలో నిలిచారు. అయితే, వారిలో మాజీ ముఖ్యమంత్రుల వారసులు ఎనిమిది మంది ఉన్నారు. ఆరుగురు కూమారులు అసెంబ్లీకి, ఇద్దరు కుమార్తెలు లోక్‌సభ అభ్యర్థులుగా కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నికైన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జగన్ పులివెందులలో గెలుపొందారు.
ఉత్తరాంధ్రలో 'కీ'లకం - విజయనగరం విజేత ఎవరో? - Vizianagaram Lok Sabha Elections
ఐటీ మాస్టర్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ బరిలో నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనుమడు అయిన లోకేశ్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు.
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు విజయం సాధించిన బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలపై కన్నేశారు. ఆయన సోదరుడు నందమూరి హరికృష్ణ గతంలో హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించడం విశేషం.
హిందూపురంలో బీసీ ఓటర్లే బలం - సైకిల్ జైత్రయాత్ర సాగించిన ఎన్టీఆర్ - Hindupur LOK SABHA ELECTIONS
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీకి దిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్నాళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన నాదెండ్ల భాస్కరావుకు కుమారుడైన మనోహర్ గతంలోనూ ఇక్కడి నుంచే రెండుసార్లు ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గానూ వ్యవహారాలు చక్కబెట్టారు. నాదెండ్ల భాస్కరరావు సైతం 1989లో ఇదే తెనాలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు సీఎంగా సేవలందించిన కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. డోన్ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పని చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
![cm_sons_in_elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-04-2024/21304815_cm_sons_in_elections.jpg)
కాకినాడలో లంగరు వేసేదెవరో ? - ఆసక్తికరంగా లోక్‌సభ పోరు - Kakinada LOK SABHA ELECTIONS
లోక్‌సభ బరిలో కుమార్తెలు
![cm_sons_in_elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-04-2024/21304815_cm_daughters_in_elections.jpg)
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీగా పోటీచేస్తున్నారు. గతంలో బాపట్ల, విశాఖపట్నం నుంచి ఆమె లోక్‌సభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కడప లోక్‌సభ అభ్యర్థిగా అధిష్ఠానం ఆమె పేరును ప్రకటించగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తన సోదరుడు, సీఎం జగన్ మోహన్‌రెడ్డి అక్రమాలు, అరాచకాలను ప్రచార అంశాలుగా తీసుకున్నారు.
గేట్ వే ఆఫ్ రాయలసీమ - కర్నూలు బురుజుపై జెండా ఎగరేసేదెవరో ? - Kurnool LOK SABHA ELECTIONS