SIT Investigation Tirumala Laddu Adulteration : తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి అపచారంపై ఏర్పాటైన సిట్ రెండో రోజూ విచారణను ముమ్మరం చేసింది. తిరుపతి పోలీసు అతిథిగృహంలో రెండున్నర గంటల పాటు శనివారం నాడు సమావేశమై చర్చించిన సిట్ సభ్యులు టీటీడీ పరిధిలోని వివిధ శాఖల అధికారులతోనూ భేటీ అయ్యారు. ఇవాళ మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో 9 మంది సభ్యులు పాల్గొన్నారు.
మూడు బృందాలుగా ఏర్పడిన సిట్ విచారణను ప్రారంభించింది. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తాం : నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వివరించారు. తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు సిట్‌కు బదిలీ అయిందని చెప్పారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. సిట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నారని వివరించారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామని పేర్కొన్నారు. దీనిపై నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదని సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెల్లడించారు.
Tirumala Laddu Ghee Issue Updates : సమావేశం ముగిసిన తర్వాత సిట్ బృందం పద్మావతి వసతిగృహం వద్ద ఉన్న టీటీడీ ఈవో బంగ్గా వద్దకు చేరుకుంది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు సభ్యులంతా ఈవో శ్యామలరావుతో సమావేశమై చర్చించారు. లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఈవో వద్దనున్న సమాచారంతో పాటు జరిగిన పరిణామాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
మరోవైపు ఈ క్రమంలోనే మూడు బృందాలుగా ఏర్పడిన సిట్ బృందంలోని ఓ బృందం తమిళనాడుకు వెళ్లనుంది. దుండిగల్ లో ఏఆర్ డైయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధను పరిశీలించనుంది. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడిసరుకలను పరిశీలించనున్నారు. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను కూడా ప్రశ్నించనున్నారు. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో విచారణ చేపట్టనుంది. నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం తితిదే, ఏఆర్ డైయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది.
కల్తీ నెయ్యిపై సిట్ విచారణ - మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటన - SIT TEAM TO TIRUMALA