Sabitha Indra Reddy vs CM Revanth : శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లిన సబితా ఇంద్రారెడ్డితో పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు ఇప్పించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేయించి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారా అని ప్రశ్నించారు.
మంత్రి సీతక్క వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తనను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు తాను సంతోషంగా ఆహ్వానించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణం అవుతావని చెప్పానని, సీఎం అవుతావని కూడా చెప్పానని సబిత గుర్తు చేశారు. రేవంత్ సీఎం అవుతావని చెప్పి మరీ గతంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించానని పేర్కొన్నారు. అయినా తనపై ఆయన ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సబితక్క నన్ను మోసం చేసింది : సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు. ఆమె తనను పార్టీలోకి ఆహ్మానించిన మాట వాస్తవమేనని ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలను సభలో ప్రస్తావించారు. 2019లో తనను మల్కాజిగిరిలో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీ కోరిందని ఆ సమయంలో తనకు అండగా ఉంటానని సబిత మాట ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ తనను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆమె బీఆర్‌ఎస్‌లో చేరారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నారని, తమ్ముడిగా తనను మోసం చేశారని రేవంత్ విమర్శించారు.
రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు సభలో ఆందోళన చేపట్టగా ఉప ముఖ్యమంత్రి స్పందించారు. ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. 2004లో వేరే పార్టీలో ఉన్న సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుని సబితకు టికెట్ ఇచ్చి 2004, 2009 లో ఆమెకు కీలక మంత్రి పదవి ఇచ్చిందని భట్టి తెలిపారు. దశాబ్ద కాలం మంత్రిగా ఉన్న ఆమెకు 2014 లోనూ కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని కానీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఆమె అధికారం కోసం పార్టీ మారారని భట్టి విక్రమార్క విమర్శించారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలతో సభాపతి పోడియం ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడి బయటకు వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.