Anarchy of father and son in Tirupati : తిరుపతి ఉపఎన్నికల్లో దొంగ ఓట్ల దందా గుర్తుందిగా? దొంగ ఓట్ల జాతరే జరిగింది.! దానికి బాధ్యతగానే ఓ ఉన్నతాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది! ఆ అక్రమాలు చేయించిన ప్రజాప్రతినిధి మాత్రం చేతికి రక్తం అంటకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. హాయిగా తన రాజకీయాలు తాను చేసుకుంటున్నారు. అది ఆయన స్టైల్. ఇక శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లోనైతే ఆరో తరగతి విద్యార్థులనూ ఓటర్లుగా చేర్పించిన బరితెగింపు ఆయనది.! ఎన్నికల సంఘం కన్నెర్ర చేసినా వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం దొంగ ఓట్లు అలాగే కొనసాగించుకోగలుగుతున్న అధికార బలం ఆయనకుంది.
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో దొంగ ఓట్లు - పోలీసులపై సస్పెన్షన్ వేటు
ఆధ్యాత్మిక నగరిలో ఆయన అరాచకం అధికారికం! అది చూసుకుని ప్రజాప్రతినిధి (People's Representative) కుమారుడు మిడిసిపడుతుంటాడు. యువరాజులా పెత్తం చెలాయిస్తాడు. రాష్ట్ర మంత్రి పర్యటన సందర్భంగా తనను తిరుపతి విమానాశ్రయంలోకి అనుమతించలేదనే ఆగ్రహంతో విమానాశ్రయ అధికారులు, ఉద్యోగుల నివాస గృహాలకు నీటి సరఫరా నిలిపివేయించారు. సిబ్బంది ఇళ్ల ముందు చెత్తకుప్పలు పోయించాడు. ఎన్నికల్లో వైరిపక్షాల్ని నామినేషన్లు వేయనీయకుండా అడ్డగించి దొడ్డిదారిలో సొంత పార్టీ వారిని ఏకగ్రీవం చేయించారు. శెట్టిపల్లెలోని భూములపై కన్నేసిన యువరాజు ఆ గ్రామాన్ని తిరుపతి నగరపాలికలో చేర్పించారు. తిరుపతి నగరానికి ఏమాత్రం అనువుకాని డబుల్ డెక్కర్ బస్సు (Double decker bus) ను 2కోట్ల 40లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసి నగరపాలిక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు.
తిరుపతి దొంగ ఓట్ల ఘటన - మరో అధికారిపై వేటు
TDR బాండ్ల పేరుతో తండ్రీకుమారులు వందల కోట్ల అక్రమార్జనకు తెరతీశారు. 2040 నాటి అవసరాలకు సరిపడా అంటూ 42 మాస్టర్‌ప్లాన్ రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. దీని వల్ల 2,545 మంది స్థలాలను కోల్పోతుండగా 1,907 మందికి టీడీఆర్ బాండ్లు ఇవ్వాల్సి వస్తుందంటూ అధికారులు జాబితా సృష్టించారు. రిజిస్ట్రేషన్ (Registration) శాఖతో కుమ్మక్కై మార్కెట్ విలువలను పెంచి 4 వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన సుమారు 400 టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. ఇందులో కమీషన్ రూపంలో ముఖ్యనేతలు, వారి అనుచరుల వాటా వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా.! తుడా మాస్టర్‌ప్లాన్ ఆమోదిత రోడ్లతోపాటు ప్రతిపాదిత రోడ్లలో సైతం బలవంతంగా భవనాలు తొలగించి రహదారుల నిర్మాణాలు చేపట్టారు. టెండర్లు ఆహ్వానించకుండా పనులు జరిపిస్తున్నారు. పనులు పూర్తయ్యాక భూసేకరణ, యజమానులకు నోటీసుల జారీ, టెండర్లు ఆహ్వానించడం వంటి ప్రక్రియలు ప్రారంభించారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమంటూ న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్న భవనాలను సైతం దగ్గరుండి కూల్చివేయించారు. ఇక తండ్రీ కుమారుల భూ ఆక్రమణలకైతే అంతేలేదు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అక్రమాలు - వైఎస్సార్సీపీకి రక్షా కవచాలుగా పోలీసులు
తండ్రీకుమారులు ప్రభుత్వ యంత్రాంగంలా సమాంతర పాలన సాగిస్తారు. తిరుపతి నగరానికి వచ్చే యాత్రికులు కల్తీ ఆహారంతో అస్వస్థతకు గురై అధికారులకు ఫిర్యాదులు చేసినా సరే తండ్రీకుమారులను అడిగి, వారు సరే అంటేనే అధికారులు తనిఖీలకు వెళ్లాలి. నడిరోడ్డుపై ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడం, అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం ఇలా దేనిపై ఫిర్యాదు అందినా వీరి అనుమతి లేనిదే అధికారులు, ఉద్యోగులు తనిఖీలు, పరిశీలనకు వెళ్లే ధైర్యం చేయరు. ఇదేంటని ఎవరైనా విమర్శిస్తే వేధింపులు ఎదుర్కొనేందుకు సిద్ధపడాల్సిందే.! ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని గతంలో ఆ నాయకుడు ప్రకటించడంతో పత్తిమణి అనే వ్యక్తి ‘ఇది రాచరికపు పాలన (Monarchy) కాదు, ప్రజాస్వామ్యం అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ఇక అంతే ఆయన అనుచరులు పత్తిమణిని అపహరించి చిట్వేలి ప్రాంతంలోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. ఐనా నిందితులపై చర్యల్లేవు.
తిరుపతిలో ముఖ్యనేతలకు తగ్గట్లే స్థానిక ప్రజాప్రతినిధులూ నియంతల్లా మారారు. వారి పరిధిలో కుళాయి కనెక్షన్ కావాలన్నా, యూడీఎస్ సదుపాయం పొందాలన్నా, ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నా ఆ ప్రజాప్రతినిధులకు కప్పం కట్టాల్సిందే. ఎంతో కొంత ముట్టజెప్తేనే వార్డు సచివాలయాల్లో దస్త్రాలు పరిశీలిస్తారు. తిరుపతిలోనిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోని హోటళ్లు, లాడ్జీల్లోకి వెళ్లేందుకు ఉన్న దారిని రెండేళ్ల క్రితం తవ్వేశారు. స్థానిక నేతకు 50 లక్షలు చెల్లిస్తేగానీ పనులు పూర్తికావని అధికారులే చెప్పడం వ్యాపారుల్ని విస్తుగొలిపింది.
తిరుపతి ఉపఎన్నిక అక్రమార్కులపై చర్యలకు రెండేళ్లు- గుంటూరులో ఓట్ల 'దొంగ'లపై ఎన్నాళ్లకో