RSS Chief Mohan Bhagwat on Reservations : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రోజుకో అంశం తెరపైకి వచ్చి సంచలనంగా మారుతోంది. ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ ప్రస్తుతం రిజర్వేషన్లు రద్దు. ఇలా రోజుకో అంశంలో రాష్ట్ర రాజకీయాలు వేడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే రిజర్వేషన్లు తొలిగిస్తుందని సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న వీడియోపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంస్థ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. హస్తం పార్టీ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆర్ఎస్‌ఎస్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన స్పష్టం చేశారు.
RSS Chief On Reservations : హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం రిజర్వేషన్లకు ఆర్ఆర్ఎస్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న అసత్య ప్రచారంపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ తమపై తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సమాజంలో భేదభావాలు పోయే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సమాజంలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాను మంచి కోసమే ఉపయోగించాలని హితవు పలికారు.
"రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకమని ఒక వీడియో వైరల్ అవుతోంది. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు.అవసరం ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలి. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను మంచి కోసం వాడాలి." - మోహన్ భగవత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్
CM Revanth Reddy Comments on Reservations : ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా దేశాన్ని రిజర్వేషన్ల రహిత దేశంగా చేయాలనేదే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. దీనితో పాటు 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి వందేళ్లవుతుందని, అప్పటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేయడానికి కుట్ర చేస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రిజర్వేషన్లపై ఏమన్నారో పూర్తిగా తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.