RS Praveen Kumar joined BRS : బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తుకు తమ అధినేత్రి మాయావతి అంగీకరించకపోవడంతోనే తాము పార్టీ మారినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పష్టం చేశారు. బలమైన తెలంగాణ వాదానికి, బహుజన వాదం తోడైతే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే అభిప్రాయంతో పొత్తు కుదుర్చుకున్నామన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రవీణ్ కుమార్ గులాబీ పార్టీలో చేరారు. ఆయనకు కేసీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒక్కటే కాబట్టి తాను బీఆర్ఎస్లో చేరినట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తాను అమ్ముడు పోయాడని సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దు అంటూ కార్యకర్తలకు ఆయన సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తుందని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు అధ్యక్షరాలు మాయావతికి ముందుగానే చెప్పి, ఆమె అనుమతితోనే రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
KCR on RS Praveen Joining : మానవ పరిణామ క్రమంలో జరిగే గుణాత్మక పురోభివృద్ధి వెనక ఎందరో మహనీయుల త్యాగాలు కృషి ఉన్నదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాల క్రమం కూడా అలాంటిదేనన్నారు. బీఎస్పీ నుంచి వచ్చినవాళ్లందరి మనసులో ఏముంటదో తనకు తెలుసన్నారు. తనకు 69 నుంచే తెలంగాణకాంక్ష మనసులో ఉందని, అనంతర కాలంలో అనేక అనుభవాలు ఉన్నాయని, కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
తెలంగాణ పోరాట సమయంలో కొందరు అవుతుందా లేదా అని అనుమానం వ్యక్తం చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో, ఆయనకు ప్రపంచ బ్యాంకు పిచ్చి పట్టుకుందని, ఆర్థిక సంస్కరణలు అమలుచేయాలని చూసేవాడన్నారు. తాగునీరు, విద్యుత్, సంక్షేమం వంటివి ప్రజలకు అక్కరలేదనే భావన ఉండేదన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేశానని, అనంతరం విద్యుత్ ఉద్యమకారులను కాల్చి చంపేశారని కేసీఆర్ పేర్కొన్నారు.
బహుజన సిద్ధాంతం మీద ఇంకా లోతుగా చర్చ జరగాలని, విపరీతమైన మేధోమథనం జరగాలని కేసీఆర్ తెలిపారు. దళితబంధు పథకంతో పార్టీకి నష్టం జరిగిందంటున్నారని కానీ అది సరికాదని, దళిత బంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. దళితశక్తితో పాటు బహుజనశక్తి కలిసిపోవాలే అనే సిద్ధాంతం కోసం కాన్షీరాం పోరాటం చేశాడని గుర్తు చేశారు. దాన్ని కోనసాగించాలని పిలుపునిచ్చారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాడులు జరిగేది దళితుల మీదనేనని, పాలకుల మీద ఐకమత్యంతో పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలి పేర్కొన్నారు.
రాజకీయాల్లో అనేక కష్టాలు వస్తాయని, తట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలని కేసీఆర్ సూచించారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామన్నారు. ఎన్ని కష్టాలెదురైనా, ప్రలోభాలు పెట్టినా తెలంగాణ వాదాన్ని వదల్లేదని, అనుకున్నది సాధించినట్లు తెలిపారు. అనేక చర్చలు మేధోమథనం అనంతరమే రైతుబంధు తెచ్చామని, సాగునీటి ప్రాజెక్టులను తేవడంతో రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నమ్మి ప్రజలు మోసపోయారని, ఒకసారి ఓడితే నష్టమేమీ లేదన్నారు.
"బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తుకు అధినేత్రి మాయావతి అంగీకరించకపోవడంతోనే పార్టీ మారాము. బలమైన తెలంగాణ వాదానికి, బహుజన వాదం తోడైతే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తుంది". - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కేసీఆర్ ప్లాన్ ఛేంజ్ - బహిరంగ సభలకు బైబై - బస్సు యాత్రలు, రోడ్ షోలతోనే ఎన్నికల ప్రచారం
కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్