CM Revanth Reddy Chit Chat in Delhi : రాష్ట్రంలో రాచరిక వ్యవస్థకు తావులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని, అవి గుర్తుకువచ్చేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర గీత రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి అప్పగించామన్న ఆయన, రాష్ట్ర చిహ్న రూపకల్పన బాధ్యతలు నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యపై నిపుణుల సూచనలతో ముందుకు వెళతామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కాళేశ్వరం సమస్య 32 పళ్లలో ఒక పన్ను విరిగితే వచ్చేది కాదని, విరిగింది వెన్నుముక అని గుర్తు చేశారు. నీటిని నిల్వ చేసి విడుదల చేసే పరిస్థితి లేదన్న ఆయన, కాళేశ్వరం కరెంట్ బిల్లులు అన్నీ సముద్రంలో వదిలిన నీళ్లలాంటివని చెప్పారు. 52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని, సముద్రంలోకి వెళ్లిన నీటికీ కరెంట్ బిల్లులు కట్టామన్నారు.
రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు - తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా సీఎం సూచనలు
ఫోన్ ట్యాపింగ్ అలా వెలుగులోకి : ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్‌పైనా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార మార్పిడి తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీల్లో ఎస్ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు మిస్ అయినట్లు గుర్తించారని, ఈ క్రమంలోనే ట్యాపింగ్ వ్యవహారం బయటికి వచ్చిందని తెలిపారు. ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకు సమీక్ష జరపలేదన్న రేవంత్ రెడ్డి, అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారని చెప్పారు. పోలీసుల పనిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తనకు తెలుసునన్నారు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు, ఫోన్ ట్యాపింగ్‌పై ఎందుకు కోరడం లేదని సీఎం ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ లాంటి కార్యకలాపాలు తమ ప్రభుత్వం చేయదని ముఖ్యమంత్రి చెప్పారు. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చని, అందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఎస్ఐబీ అధికారులు కేంద్ర నిఘా సంస్థలతోనే నేరుగా మాట్లాడతారు తప్ప, తనతో కాదన్నారు. 1980, 90ల నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో? బ్యాకప్ కూడా ఉందో లేదా దాన్ని కూడా మాయం చేశారో అంతా దర్యాప్తు అధికారులకు తెలుస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు.
ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవు కదా? : రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఏ వ్యవస్థనూ ఇప్పటి వరకు దురుపయోగపర్చలేదన్న సీఎం రేవంత్, పక్కనున్న ఏపీలో ఎంత మంది అధికారులను మార్చారు? తెలంగాణలో ఎంత మందిని మార్చారో చూస్తే అర్థమవుతుందన్నారు. ఏ ఒక్క అధికారిపైనా ఎలాంటి ఆరోపణ రాలేదన్న సీఎం, ఒకవేళ అధికారులు తమకు అనుకూలంగా పని చేసి ఉంటే, ప్రతిపక్షాలు చూస్తూ కూర్చోవు కదా అన్నారు.
ఆ విషయాలన్నీ త్వరలోనే బయటపెడతా : రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈదురు గాలుల కారణంగా చెట్లు పడిపోవడం, విద్యుత్ వినియోగం పెరగడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. పునరుద్ధరణ విషయంలో కొంత సమయం తీసుకుని ఉండొచ్చునన్నారు. గతంలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ తెలంగాణలో పెరిగిందన్న ఆయన, అందుకు అనుగుణంగా ఎక్కడా సమస్యలు రాకుండా చేసినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విద్యుత్‌కు సంబంధించిన అన్ని విషయాలు బయటపెడతామని స్పష్టం చేశారు.