Protest To YS Bharathi : వైఎస్సార్ జిల్లా పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్ పులివెందుల నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఏళ్లుగా వారిదే ఆధిపత్యం. ఆ కుటుంబం చెప్పిన మాటే శాసనంగా సాగిపోతోంది. ప్రతీ ఎన్నికల్లోనూ భారతి తన భర్త జగన్ గెలుపు కోసం ప్రచారం చేయడం పరిపాటే. అయితే ఈసారి ఎప్పుడూ లేనంతగా భారతి గడపగడపకూ వెళ్తున్నారు. కుటుంబసభ్యులు, బంధువులనూ రంగంలోకి దింపి మరీ ప్రచారం చేస్తున్నారు. జగన్‌ని గెలిపించండి అంటూ అభ్యర్థిస్తున్నారు. ఇక్కడే గతానికి కన్నా భిన్నంగా భారతికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
YS Bharathi Election Campaign In Pulivendula : గత నెల 29న ప్రచారంలో భాగంగా వేంపల్లె మండలం కొమరంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న భారతికి వైఎస్సార్సీపీ నాయకుల నుంచే చేదు అనుభవం ఎదురయింది. వైఎస్సార్సీపీ నేత, మాజీ సర్పంచ్ భాస్కర్‌రెడ్డి భారతికి ఎదురెళ్లి ఆమెను వివిధ అంశాలపై ప్రశ్నించారు. జగన్ ప్రతిసారి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని పదేపదే మాట్లాడుతున్నారు గానీ ఒక్కసారైనా నా రైతన్న అని మాట్లాడారా అని భారతిని ప్రశ్నించారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాల్లో సీఎం జగన్ ఫోటో ఎందుకు పెట్టారని భారతిని ప్రశ్నించారు. మా తాతల కాలం నుంచి రైతుల ఫోటోలే పాసుపుస్తకాలో ఉన్నాయని ఇప్పుడు మాత్రమే జగన్ ఫోటో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. పలు ఇతర అంశాలపైనా నిలదీశారు. అన్ని విషయాలను విన్న భారతి మౌనంగానే ఉండిపోయారు.
Pulivendula People Fire on CM Jagan : రెండ్రోజుల క్రితం చక్రాయపేట మండలం మాలతిమ్మయ్యగారిపల్లెలో భారతి ఇంటింటి ప్రచారానికి వెళ్లగా స్థానికులు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. భారతి పర్యటనలో ఉన్న నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మరింతగా స్వరం పెంచి తమ కష్టాలు చెప్పుకొన్నారు. పక్కా ఇళ్లు మంజూరు కోసం తనతో పాటు తన కుమారుడు నాలుగైదు సార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదని భారతి ఎదుట కాలగిరి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు ఈ సారికి ఓటేయి చేస్తామంటూ నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె తన సమస్యను చెబుతుండటంతో వారు గట్టిగా మాట్లాడారు. దీంతో భారతి జోక్యం చేసుకుని పింఛను వస్తోందా? అవ్వ అంటూ ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేశారు.
ఇంటికోసం 12 సార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని, బోదకొట్టంలో జీవనం సాగిస్తున్నానంటూ దాన్ని చూపించి ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి గుండెలో చిల్లు పడినప్పటికీ వైద్యం చేయించలేకపోతున్నామని మరో మహిళ భారతి వద్ద ప్రస్తావించారు. గోడకూలిన ప్రమాదంలో తన బిడ్డకు నడుము విరిగిపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం రాలేదంటూ ఓబులశెట్టి లక్ష్మీదేవి అనే మహిళ వాపోయారు. అర్హత ఉన్నా ప్రభుత్వం పించి తమకు అమ్మఒడి పథకం వర్తించలేదని, భర్త ఆటో నడుపుతున్నా ఎలాంటి లబ్ధి చేకూరలేదని సుదర్శనమ్మ అనే మహిళ ప్రస్తావించారు. ఈసారికి గెలిపించండి అన్నీ పరిష్కరిస్తామని చెప్పి భారతి ముందుకు వెళ్లిపోయారు.
Pulivendula YS Family Politics : గతంలో వివేకానందరెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి ప్రస్తావనలు వచ్చేవి కావు. ఆయన మరణంతో ప్రజా సమస్యలు పట్టించుకునే వారే కరవయ్యారు. సీఎం జగన్ వచ్చినా సొంత నియోజకవర్గంలోనూ పరదాల చాటున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైనా ఆయనను కలవాలంటే ముందస్తుగా పాసులు తీసుకోవాల్సిన పరిస్థితి. పాసులు పొందడం అంత సులువు కాదు. వివేకా హత్య జిల్లాతో పాటు నియోజకవర్గంలోని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సీబీఐ విచారణ, ఛార్జిషీట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావడంతో జనంలో పెద్ద చర్చ జరుగుతోంది.
పులివెందులలో వైఎస్ భారతికి సమస్యల స్వాగతం - YS Bharti Election Campaign
జగన్ సోదరి షర్మిల సైతం వివేకా హత్య అజెండాపైనే కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలోకి దిగారు. వివేకా కుమార్తె సునీత గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజాకోర్టులో న్యాయం కావాలని వేడుకుంటున్నారు. షర్మిల, సునీత కొంగు చాచి ధర్మం, న్యాయం కావాలంటూ దీనికి ప్రజల మద్దతు కావాలని వేడుకుంటున్నారు. అటు రాజన్న బిడ్డ షర్మిల, ఇటు వివేకా తనయ సునీత కొంగుచాచి అనేంత పదాలు వాడడం ప్రజల మనసులను కదిలించాయి. ఈ పరిణామాల క్రమంలో జగన్ కుటుంబం ఎన్నికలపై మరింత జాగ్రత్త పడుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలకు పార్టీ తరపున 50 వేల నుంచి 5 లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఆర్థికసాయం ఆదించేందుకు ఓ దరఖాస్తు సైతం రూపొందించి అందుబాటులోకి తెచ్చారు.
భారతి పర్యటనలో పోలీసులు, అనుచరులు నిలదీతలు తగ్గించడానికి ఓ వైపు కృషి చేస్తుండగా నియోజకవర్గంలో పరిణామాలను పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన చోట్ల డబ్బుల పంపిణీకి సిద్ధమైనా ఉద్యోగులు చాలా మంది తాయిలాలను తిరస్కరించడం వైఎస్సార్సీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ ఎటు దారితీస్తాయోననే ఆందోళన జగన్ కుటుంబంలో నెలకొంది.