Election Campaign in Telangana : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బీడీ కార్మికులతో సమావేశమయ్యారు. అధికారంలోకి రాగానే బీడి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా గిరిజనులందరూ ఏకతాటిపైకి రావాలని గిరిజన మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వీరన్ననాయక్ కోరారు.
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లిలో యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణను ఆశీర్వదించాలని కోరారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో వరంగల్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ రోడ్‌షో నిర్వహించారు. తనను ఎంపీగా గెలిపిస్తే మామునూరు విమానాశ్రయం పునరుద్దరణకు కృషి చేస్తానన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
BJP MP Candidate Election Campaign : పెద్దపెల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసారి పెద్దపెల్లిలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో నిజామాబాద్ కమలం పార్టీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలను మభ్యపెట్టడానికి రిజర్వేషన్లు రద్దు అనే బూటకానికి తెరలేపాయని మండిపడ్డారు. భువనగిరిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సంతకాల ఫోర్జరీ చేసిన వ్యక్తికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందని మండిపడ్డారు. గల్లీలో లేని బీఆర్ఎస్ను దిల్లీకి పంపినా ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు.
ఎలక్షన్ వార్ - ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల దూకుడు - lok sabha elections 2024
భద్రాచలంలో మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా మాలోత్ కవిత నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు రోడ్ షో నిర్వహించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేంద్రంలో వచ్చేది బీజేపీయేనని ఆయన అన్నారు. నల్గొండ కమలం పార్టీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నమో యువ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న సైదిరెడ్డి కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో గులాబీ పార్టీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డిని, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదితను గెలిపించాలని మాజీమంత్రి మహమూద్ అలీ కోరారు. బీఆర్ఎస్తోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని ఆయన వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా పూడూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రా రెడ్డి హాజరయ్యారు. నల్గొండ, భువనగిరి గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. మోదీ, రేవంత్ కుట్రలో భాగమే కేసీఆర్ ప్రచార నిషేదమని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.