Parties Buying Politicians in Telangana : సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు ఇచ్చి రాజకీయ పార్టీలు ప్రలోభాలు పెట్టడం చూస్తుంటాం. ఇలాంటి విషయాలను కూడా వింటుంటాం. కానీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొత్త పంథాను ఎంచుకొని స్థానిక సంస్థల ప్రతినిధులు, నేతలకు డబ్బులు ఆశ చూపుతున్నారు. ఈ విధంగా కొందరు డబ్బులు ఇస్తుంటే మరికొందరు పదవులతో ఆశ పెడుతున్నారు. దీంతో కొందరు పార్టీ మారుతుంటే మరి కొంత మంది మాత్రం పార్టీ మారకుండా అందులోనే ఉంటూనే అంతర్గతంగా పని చేయడానికి పూనుకుంటున్నారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ప్రలోభాలకు ఓటర్లను వదిలేసి, నాయకులను రాజకీయ పార్టీ పట్టుకుంటున్నాయి.
అందరినీ అనుమానించాల్సిన పరిస్థితి : ఇలాంటి పరిస్థితులతో పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయాలే పార్టీలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో అయితే ఎన్నికలకు వారం రోజుల ముందు నుంచే ఓటర్లను కొనేందుకు పార్టీలు సిద్ధమయ్యేవి. ఓటింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి కొన్ని పార్టీలు పంపకాలు ప్రారంభించేవి. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. స్థానికంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసే నేతలను కొనేందుకు వెనుకడుగు వేయడం లేదు. అప్పుడు వారి బలాన్ని చూసి ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. కొంతమందికి పదవులను ఆశగా ఎర వేస్తున్నారు.
హామీలతో నేతలకు కాంగ్రెస్ వల : ఇలాంటి హామీతోనే కాంగ్రెస్ అనేక నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లను పార్టీలోకి తీసుకుంటుంది. ఈక్రమంలోనే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధి బోడుప్పల్, పిర్జాదిగూడ, జవహర్‌నగర్ నగరపాలక సంస్థల పాలకవర్గాలను గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పటికే వీరిలో చాలా మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో భాగంగా జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లు కాంగ్రెస్ వశమయ్యాయి. ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్మన్ ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఇప్పటికే మేడ్చల్ మున్సిపాలిటీలోని సగం మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. గుండ్లపోచంపల్లి, కొంపల్లి పురపాలికలపై ఇంకా కాంగ్రెస్ దృష్టి సారించింది. నార్సింగ్ మున్సిపాలిటీలో 11 మంది కౌన్సిలర్లు, తుక్కుగూడ మున్సిపాలిటీ, మీర్‌పేట కార్పొరేషన్‌లోని బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతోనూ కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నారు. పార్టీలో చేరే వారికి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.
దక్షిణ కర్ణాటకలో ఆసక్తికర పోరు- బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్- గెలుపు ఎవరిదో?
ఎమ్మెల్యేల అనుచరులకు ఎర : మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుచరులుగా ఉన్న నేతలపైనా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఇలా వీరిని చేర్చుకోవడం వల్ల సంబంధిత ఎమ్మెల్యేల ప్రాధాన్యతను తగ్గించాలని చూస్తోంది. ముఖ్యంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాత్రను తగ్గించి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ప్రాధాన్యతను తగ్గించేందుకు పావులు కదుపుతోంది. అలాగే బీఆర్ఎస్, బీజేపీ సైతం కాంగ్రెస్‌లోని అసంతృప్తులపై గేలం వేసి అంతర్గత ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఫైనల్లో క్షేత్రస్థాయిలో కొంత మంది నేతలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, ఏ అభ్యర్థికి పనిచేస్తున్నారనే దానిపై ప్రధాన పార్టీల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులను తీసుకొస్తుంది.
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం ఎవరిది? - నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న ప్రధాన పార్టీలు
కాంగ్రెస్‌లో చేరికలపై ఏఐసీసీ కమిటీ - పార్టీలోకి ఎవరు వచ్చినా కండువా కప్పాల్సిందే