Pinnelli Ramakrishna Reddy is Likely to be Arrested : దాదాపు 15 ఏళ్లుగా అవినీతి, అక్రమాలు, అరాచకాలకు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చిన మాచర్ల మారీచుడు మాజీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇవాళ అరెస్టు చేసే అవకాశం ఉంది. పాల్వాయి గేట్లో ఈవీఎం ధ్వంసంతో పాటు, మూడు హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లిని అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్? : మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు పిన్నెల్లి సోదరులు అనేక అరాచకాలకు, దాడులకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డే స్వయంగా ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో సిట్ విచారణలో వెలుగుచూడటం దేశ వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పోలింగ్ అనంతరం కూడా నియోజకవర్గంలో పిన్నెల్లి, ఆయన అనుచరులు టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు.
మాచర్లకు మంచిరోజులొచ్చాయ్ - పిన్నెల్లికి వాత పెట్టిన ఓటర్లు - Macherla Constituency Poll Result
బాధితుల ఫిర్యాదుతో తీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్ పిన్నెల్లి అరెస్టుకు ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ పొందారు. 6వ తేదీ వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై పిన్నెల్లి బాధితుడు నంబూరు శేషగిరిరావు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు తీర్పుతో విబేధిస్తూ పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6న హైకోర్టు పిన్నెల్లి కేసును విచారించి, పరిష్కరించాలని స్పష్టం చేసింది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంటి ఆవరణలో పోలీసులు : హైకోర్టు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో పిన్నెల్లి అరెస్టు మీద రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం పిన్నెల్లి నరసరావుపేటలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉండటంతో ఆ ఇంటి బయట పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు. మఫ్టీలో పోలీసులు పహారా కాస్తున్నారు.
మరోసారి పిన్నెల్లి తప్పించుకోకుండా ఉండేందుకు ఇంటి వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్, ఆ తరువాత జరిగిన ఘటనలతో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేశారు. ప్రస్తుతం పల్నాడు ప్రాంతమంతా హై అలర్ట్ కొనసాగుతోంది. వ్యాపార దుకాణాలను మూసివేశారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఇక ఖాయమని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.