Parliament Election Expenditure of Candidates : ఎన్నికలు అంటే చాలు భారీగా డబ్బులు ఖర్చుపెట్టందే ఓటర్లను ప్రసన్నం చేసుకోలేమనే తీరుకు నాయకులు వచ్చేశారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం(Lok Sabha Polls 2024) పెద్ద ఎత్తున చేపట్టాలంటే దిగువన ఉన్న నాయకుల నుంచి డబ్బును పంచిపెట్టుకొని రావాలని కొంతమంది భావిస్తుంటారు. గ్రామ, మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేతలంతా పైసలు ఇస్తేనే ఎన్నికల రణరంగంలోకి దిగుతామని చెప్పడంతో అందుకు అయ్యే వ్యయాన్ని అభ్యర్థే పెట్టుకోవాలని ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ఉండే నేతలు అడుగుతున్నారు.
ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండనుండగా, దాదాపు 40 నుంచి 50 మండలాలు అందులో ఉంటున్నాయి. ఈ ఒక్కో మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యలు, సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు కలిపి వంద మందికి పైగానే ఉంటారు. ఇప్పుడు నాయకులు అంతా ప్రచారం(Election Campaign)లో చురుగ్గా పాల్గొంటేనే అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే నాలుగు నెలలు క్రితం జరిగిన ఎన్నికల్లో భారీగా డబ్బును ఖర్చు చేయడం వల్ల ఇప్పుడు డబ్బును ఖర్చు చేయడానికి ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జులు సుముఖంగా లేరని ఒక లోక్సభ అభ్యర్థి స్పష్టం చేశారు. అయితే ఒక్కో నియోజకవర్గానికి ప్రచారానికి రూ.10 కోట్లు దాకా అవసరం అవుతాయని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు.
Lok Sabha Candidates Election Campaign : అయితే వచ్చే నెల 11వ తేదీ వరకు లోక్సభ ఎన్నికల ప్రచార గడువు ఉంది. అప్పటివరకు లోక్సభ నియోజకవర్గం మొత్తం అలుపెరగకుండా తిరగాలంటే కనీసం రూ.50 కోట్లుకు పైగా అవసరమవుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. వేసవికాలం కావడంతో ఏసీ వాహనాలు, మజ్జిగ, భోజనాలు, మంచినీరు, బిర్యానీలు, ప్రచార పత్రాలు, మద్యం, ఫ్లెక్సీలు ఇలా అన్నింటికీ భారీగా డబ్బు అవసరం అవుతుంది. ఏదైనా చిన్న గ్రామంలో ప్రచారానికి వెళ్లాలి అన్నా ఖర్చులు(Lok Sabha Election Expenditure) ఇవ్వాలని కార్యకర్తలు, అక్కడి ఛోటామోటా నేతలు అడుతున్నారని అభ్యర్థులు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో ఒక్కో కార్యకర్త రోజుకు రూ.1000 దాకా అడుగుతున్నారని చెబుతున్నారు. ఇందుకు భోజనం, మద్యం అదనం. అలాగే మండలస్థాయి నేతలకు రూ.లక్షల్లో చెల్లిస్తేనే ప్రచారానికి ముందుకు వస్తున్నారని వాపోతున్నారు. ఇవి కాకుండా ఆయా సామాజిక వర్గ సంఘాలు, కాలనీ సమూహాల విజ్ఞప్తుల మేరు సామూహిక అవసరాల కోసం అక్కడక్కడా భారీ మొత్తం సొమ్ము వెచ్చించాల్సి ఉంటుంది. స్థానికులకు అవసరమైన కొన్ని పనులు కూడా చేసి పెట్టాల్సి వస్తుందన్నారు.
44 రోజుల ప్రక్రియ- తొలి లోక్సభ ఎన్నికల తర్వాత ఇప్పుడే ఎక్కువ!
రోజుకు రూ. కోటి ఖర్చు తప్పదా : ప్రతి పార్టీకి ప్రచారంలో నియోజకవర్గ నేతలు కీలకం, ఎందుకంటే వారే ముందుండి నడిపిస్తే కార్యకర్తలు, స్థానిక నేతలు కదులుతారు. వారు అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే కొందరు ప్రచారానికి రాలేమని తేల్చి చెబుతున్నారు. వారే చేతులెత్తేస్తుండటంతో అడిగినంత ఇచ్చి ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో నియోజకవర్గానికి ఒకరోజు ప్రచారానికి రూ.కోటి వరకు ఖర్చువుతోందని అనధికారిక సమాచారం. పార్టీ విజయం సాధించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ఉన్న పార్టీలు ఎమ్మెల్యేలు కూడా కొంత మొత్తంలో ఆ వ్యయాన్ని భరిస్తారని లోక్సభ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం డబ్బులు ఇవ్వలేమని చెబుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారిదీ కూడా అదే పరిస్థితిగా కనిపిస్తోంది.
అప్పులు చేసైనా సరే : రాష్ట్రంలోని కొన్ని స్థానాల్లో లోక్సభ అభ్యర్థులు పార్టీ నిధులు కోసం వేచి చూడగా, కొందరు మాత్రం ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు వారికే టికెట్లు కూడా అధిష్ఠానం కేటాయించడంతో పార్టీ ఇచ్చే నగదు కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఖర్చు చేసుకుంటున్నారు. వీరిలో కొందరైతే భారీగానే ఖర్చు చేసినట్లు సమాచారం. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో నెగ్గాలంటే రూ.100 కోట్ల దాకా ఖర్చు అవుతాయని అనధికారిక అంచనా. ఇప్పుడు పోటీ చేసే వారిలో చాలా మంది ఎంపీగా గెలిస్తేనే రాజకీయంగా పేరు, పలుకుబడి వస్తాయని అంటున్నారు. అందుకే అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఎన్నికల్లో భారీగా డబ్బును వ్యయం చేస్తున్నారు. కొందరు నేతలైతే మాత్రం భారీగా డబ్బు ఖర్చు పెట్టకపోతే గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు.
చేరికలను ఆహ్వానిస్తూ, బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తూ - 'పార్లమెంట్'లోనూ హస్తం 'అసెంబ్లీ' స్ట్రాటజీ
వరంగల్‌లో గులాబీ గెలుపు ఖాయం - బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్