CM Jagan Memu Siddam Bus Yatra: జగన్ పర్యటన దృష్ట్యా ప్రకాశం జిల్లా కనిగిరిలో విద్యుత్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. జగన్ బస్సుయాత్ర సాగే రహదారిలో అధికారులు విద్యుత్ తీగలను తొలగిస్తున్నారు. దీంతో కరెంటు వైర్లను తొలగిస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకొని, వాగ్వాదానికి దిగారు. కనిగిరితో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సీఎం సభకు ఆర్టీసీ బస్సులు సైతం తరలిండంతో, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక నానాపాట్లు పడుతున్నారు.
విద్యుత్, రావాణా ఏర్పాట్లపై దృష్టి: ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర నేపథ్యంలో విద్యుత్, రవాణా శాఖ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. నేడు బస్సుయాత్రలో భాగంగా, సీఎం జగన్ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా, అధికారులు విద్యుత్, రావాణా ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. అందులో కనిగిరి పట్టణంలో విద్యుత్ అధికారులు విద్యుత్ వైర్లను తొలగింపు చర్యలు చేపట్టారు. కనిగిరితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఫలితంగా కనిగిరి పట్టణవాసులు విద్యుత్, నీటి కోసం ఇబ్బందులు పడ్డారు.
బస్సులు లేక ఇబ్బదులు పడుతున్న ప్రయాణికులు: మరోవైపు కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి సభకు కోసం వైసీపీ కార్యకర్తలను తరలించేందుకు కేటాయించారు. ఫలితంగా కనిగిరి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు, మంత్రులు బస్సు యాత్రలు, పాదయాత్రలు చేసినప్పటికీ, ఇంతలా ఆంక్షలు పెట్టలేదని కనిగిరి ప్రజలు ఆరోపిస్తున్నారు.
అంతన్నాడు, ఇంతన్నాడు - తీరా చూస్తే నెల్లూరువాసులను నట్టేట ముంచారు - CM Jagan Visit to Nellore
సీఎం జగన్ కు స్వాగతం తెలపడానికి: మరో వైపు సీఎం పర్యటన సాగే రహదారి వెంట, స్వాగతం పలికేందుకుగాను స్థానిక నేతలు, కార్యకర్తలను భారీ సంఖ్యలో తరలించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, వారిని రోడ్లపైనే వదిలేశారు. స్వాగతం పలకడానికి వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో వైసీపీ పెద్దలు విఫలమయ్యారు. ఫలితంగా తాగేందుకు నీరు లేక ఎర్రటి ఎండలో కార్యకర్తలు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడక్కడ వాటర్ ప్యాకెట్లను పంచుతున్నారని తెలిసిన కార్యకర్తలు, అక్కడికి చేరుకొని వాటర్ ప్యాకెట్ల కోసం కుస్తి పడుతున్నారు.
సీఎం సభ కోసం 70 బస్సులు కేటాయించిన అధికారులు!: మరోవైపు మార్కాపురం నియోజకవర్గంలో పడకండి మెట్ల వద్ద సాయంత్రం జరగబోయే సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు, నేతలను తరలించడానికి మార్కాపురం డిపోకు చెందిన సుమారు 70 బస్సులు కేటాయించారు. దీంతో మార్కాపురం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం నుంచి బస్సుల కోసం బస్టాండ్లో నిరీక్షిస్తున్నారు. ఉగాది నేపథ్యంలో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు మార్కాపురం నుంచి శ్రీశైలం వెళ్తారు. బస్సుల సమస్యలపై ఆర్టీసీ సిబ్బందిని ప్రశ్నిస్తే, వెళ్లి సీఎం జగన్ ను అడగాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు.
జగన్ బస్సుయాత్రలో ఉద్రిక్తత - పోలీసులకు నాయకులకు తోపులాట - CM Jagan Bus Yatra