No Ticket to Minister Gudivada Amarnath: అనకాపల్లి వైసీపీ సీటు భరత్‌కేనని సీఎం జగన్ ఖరారు చేసేశారు. జగన్ ప్రకటనతో మంత్రి అమర్నాథ్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే అన్నట్లు పరిస్థితి మారిపోయింది. గతంలోనే అనకాపల్లి సమన్వయకర్తగా భరత్‌ను ప్రకటించిన తరువాత మంత్రి అమర్నాథ్‌కు పెందుర్తి సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ సీటు సిటింగ్ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కేనని వైసీపీ అధిష్ఠానం చెప్పినట్లు ఆయన అనుచరవర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఆ తర్వాత ఎలమంచిలి, చోడవరం నియోజకవర్గాల్లో అమర్‌కు సీటు ఇచ్చే అవకాశాలపై పరిశీలించినప్పటికీ సామాజిక సమీకరణాలు, సర్వేలలో వెనుకబాటుతో మంత్రి ఆశలకు గండిపడింది. తిరిగి అనకాపల్లి సీటే ఇస్తారంటూ ఇటీవల ప్రచారం జరగ్గా, సీఎం ఆ సీటు భరత్‌కేనని తాజాగా తేల్చిచెప్పేశారు. జగన్ ప్రకటనకు ముందే తన పరిస్థితి ఏంటో ఓ అంచనాకు వచ్చిన అమర్నాథ్ ఇలా చెప్పుకొచ్చారు.
"అన్నా అనకాపల్లికి భరత్‌ని పెట్టారు, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నావు అని చాలా మంది అడిగారు. ఈ జిల్లాలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, రాష్ట్రంలో ఉన్న పలు మీడియా సంస్థలకు జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఈ రోజు ఒకటే తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఉమ్మడి విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తా. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం చారిత్రక అవసరం. జగన్ కోసం నేను పోటీ నుంచి తప్పుకోవడానికి అయినా సిద్ధం. అందరి తలరాతలు భగవంతుడు రాస్తే, నా తలరాత జగన్మోహన్ రెడ్డి రాస్తారు". - గుడివాడ అమర్నాథ్, మంత్రి
అందరి తలరాతలు దేవుడు రాస్తే నా తలరాత జగన్మోహన్ రెడ్డి రాస్తారు: గుడివాడ అమర్నాథ్
భరత్‌కే సీటు అంటూ సీఎం ప్రకటించే సమయంలో పక్కనే ఎంపీ సత్యవతి ఉన్నప్పటికీ ఆమె అభ్యర్థిత్వంపై ఆయన ప్రకటన చేయలేదు. దీంతో ఈసారి ఆమెకు మొండి చేయి చూపినట్లేననే చర్చ సాగుతోంది. అనకాపల్లి ఎంపీ సీటు అమర్‌కు ఇస్తారంటూ ఆయన అనుచరగణం చెప్పుకొస్తున్నా, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో ఒకటి గవర సామాజికవర్గానికి ఇవ్వడం ఆనవాయితీ కావడంతో ఆ రేసులో ఆడారి ఆనంద్ సోదరి అయిన పీలా రమాకుమారి, వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేటి కాశీవిశ్వనాథ్ ఉన్నారు.
గాజువాక సిటింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డిని సమన్వయకర్తగా మార్పు చేసి, ఆ స్థానంలో ఉరుకూటి చందును నియమించారు. మంత్రి అమరనాథ్‌కు బంధువు, శిష్యుడైన చందుని తిప్పల నాగిరెడ్డి వర్గం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇటీవల ఆ స్థానంలో విశాఖ మేయర్ గొలగాని హరివెంకటకుమారికి సీటు అంటూ సర్వేలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో గాజువాకకు నిధులు ఎక్కువగా కేటాయించారు. శంకుస్థాపనల్లో మేయర్ ఇటీవల హడావుడిగా ఉన్నారు. దీంతో గాజువాకలోనూ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించిన వారికి చుక్కెదురు అయినట్లేనని చెబుతున్నారు.
కంట తడి పెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్ - టికెట్ ఇవ్వనందుకేనా?