Nara Lokesh Shankharavam Meeting: దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, వారి కుటుంబానికి రెండు ఓట్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడని ప్రశ్నిస్తే మంత్రులు పిట్టకథలు చెబుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే వైసీపీ పేటీఎం బ్యాచ్‌పై కఠిన చర్యలు తప్పవని లోకేశ్ హెచ్చరించారు. విజయనగరం జిల్లా రాజాం, చీపురుపల్లిలో నిర్వహించిన శంఖారావం సభల్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు.
ప్రజా ధనాన్ని సీఎం జగన్ లూటీ చేస్తున్నారు: నారా లోకేశ్
పైడితల్లి అమ్మవారు ఉన్న ప్రాంతం విజయనగరం జిల్లా. అలాంటిది ఇక్కడ ఏ పని ప్రారంభించినా విజయం దక్కుతుందని రాజాం సభలో లోకేశ్ అన్నారు. ఈ క్రమంలో అధికార వైసీపీ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఏ అధికారైనా తన రెడ్‌బుక్‌లోకి ఎక్కక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెత్త సలహాలు ఇస్తూ కోట్ల రూపాయల జీతం తీసుకుంటున్నారని మండిపడ్డారు. సలహాదారు సజ్జల రూ.150 కోట్ల ప్రజాధనం లూటీ చేశారని ఆరోపించారు.
సజ్జలకు మంగళగిరి, పొన్నూరులో ఓటు ఉంది. అంతే కాకుండా తిరుపతి ఉపఎన్నికలో వేలసంఖ్యలో దొంగఓట్లు నమోదు చేశారని అన్నారు. నేను నమ్మింది అంబేడ్కర్ రాజ్యాంగాన్ని, జగన్ నమ్మింది రాజారెడ్డి రాజ్యాంగాన్ని అని ధ్వజమెత్తారు. తాను ఏ శాఖకు మంత్రో బొత్సకే తెలియదని ఎద్దేవా చేశారు. జగన్ కేబినెట్ దేశంలోనే "చెత్త కేబినెట్"గా నిలిచిందని చురకలంటించారు. పన్నుల భారం మోపి ప్రజలను జగన్ దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం - జనసేన అధికారంలోకి రాగానే పేదలకు మరింత సంక్షేమం అందిస్తామని రాజాం సభలో ప్రకటించారు.
జగన్ హయాంలో ఇంట్లో పెంచుకునే కుక్కకు కూడా పన్ను: లోకేశ్
ఉత్తరాంధ్రపై మూడు కుటుంబాల పెత్తనం సాగుతోందని లోకేశ్ చీపురుపల్లి సభలో ధ్వజమెత్తారు. ఆ కుటుంబాలు కనిపించిన భూమినల్లా మింగేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతల భూకబ్జాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సెంట్ స్థలాల పేరుతో ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని తెలుగుదేశం - జనసేన అధికారంలోకి రాగానే పేదలకు రూపాయి ఖర్చు లేకుండా పక్కా గృహాలు కట్టిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లాను క్యాన్సర్ గడ్డలా పీడిస్తున్న బొత్స కుటుంబం పోవాలంటే ఓటు ద్వారా రేడియేషన్ ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సొంత తల్లి, చెల్లే జగన్‌ను నమ్మడం లేదు అలాంటి జగన్‌ను రాష్ట్రంలోని మహిళలు ఎలా నమ్ముతారని అన్నారు. టీడీపీ - జనసేన వచ్చాక వైసీపీ పేటీఎం బ్యాచ్‌పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నా పాదయాత్రలో తెలుగు ఆడపడచుల కష్టాలను తెలుసుకున్నానని, కచ్చితంగా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడని కార్యకర్తలకు వందనం అని ప్రతి కార్యకర్త కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అవినీతిపై చర్చకు సిద్ధం - ఎవరు ఎంత చేశారో చర్చలో తేలిపోతుంది: నారా లోకేశ్