Nara Lokesh Fire On CM Jagan : వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అనంతపురం జిల్లాలోని అనంతపురం, తాడిపత్రిలో జరిగిన శంఖారావం సభల్లో పాల్గొన్న లోకేశ్ అధికార పార్టీని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
అనంతపురంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారని అన్నారు. కొత్త నోటిఫికేషన్లు వస్తాయని యువత ఆశగా ఎదురు చూసిందని చెప్పారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాలల్లో చేయని పనులు ఇప్పుడిప్పుడే ఆయనకు గుర్తు కొస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ ఏం చేశారో జగన్‌ను ప్రజలు నిలదీయాలని కోరారు. పథకాలన్నీ రద్దు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వంలోని 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక సీఎం జగన మోహన్ రెడ్డే అని విమర్శించారు. ఈ ఐదేళ్లలో అన్ని ఛార్జీలను పెంచడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ పాలనలో సీమకు తీరని ద్రోహం : నారా లోకేశ్
తాడిపత్రిలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడుతూ, తాడిపత్రిలో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. మైనార్టీలను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోసగించిందని నిప్పులు చెరిగారు. ఇక్కడి టీడీపీ కార్యకర్తలపై వెయ్యి దొంగ కేసులు పెట్టారని ఆరోపించారు. పార్టీలోని ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇచ్చారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైలులో పెట్టారని, జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 102 అక్రమ కేసులు పెట్టారని, తనపై 22 అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. బాంబులకే భయపడలేదని చిల్లర కేసులకు భయపడతామా? అంటూ ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై న్యాయ విచారణ జరిపిస్తామని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టమని, వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
చిలకలూరిపేట బహిరంగ సభకు ప్రధాని మోదీ - ఏర్పాట్లలో లోకేశ్
స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అవినీతికి అంతే లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే, దోచేసిన సొమ్మును వడ్డీతో సహా వసూలు చేస్తామని హెచ్చరించారు. తాడిపత్రిలో శంఖారావం సభ వరకు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం జిల్లాలో జరిగిన శంఖారావం రెండు సభలకు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన కార్యకర్తలు, పార్టీ నాయకులు తరలివచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా పని చేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. శంఖారావం సభల్లో పాల్గొన్న టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.