Nara Lokesh Fire On CM Jagan : రాయలసీమ మళ్లీ రత్నాల సీమగా మారాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ హయాంలో పెద్దఎత్తున తాగు, సాగు నీటి పనులు జరిగితే సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో పడకేశాయని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గంలో జరిగిన శంఖారావం సభల్లో పాల్గొన్న లోకేశ్ అధికార పార్టీని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : తెలుగుదేశం పార్టీ హయాంలో అనంతపురం జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడితే జగన్ పాలనలో మళ్లీ కరవు బాట పట్టిందని లోకేశ్ విమర్శించారు. ఉరవకొండలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. ఏ నియోజకవర్గంలో లేనంతగా పయ్యావుల కేశవ్ ఉరవకొండను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన లోకేశ్ అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు. చేనేతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
వైసీపీ పాలనలో ప్రగతి నిల్ - అక్రమాలు ఫుల్: లోకేశ్
"ఉరవకొండలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. జగన్ హయాంలో కనీసం 8 ఎకరాలకు సాగునీరు ఇచ్చారా? ప్రతి చెరువుకు నీరు, మెగా డ్రిప్ ఇరిగేషన్ తీసుకువస్తాం. మంగళగిరి మాదిరిగా ఉరవకొండ చేనేతలను ఆదుకుంటాం. కొత్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నాది." -తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
ప్రిజనరీ జగన్ - విజనరీ బాబు : ఉరవకొండ సభ అనంతరం రాయదుర్గం రాయల్ పీజీ కళాశాలలో నిర్వహించిన సశంఖారావం సభలో లోకేశ్ పాల్గొన్నారు. ప్రిజనరీ జగన్‌కి విజనరీ బాబుకు చాలా తేడా ఉందని ప్రజలందరూ గుర్తించాలని అన్నారు. తెలుగుదేశం హాయాంలో రాయదుర్గం అభివృద్ధికోసం కృషి చేశామన్న లోకేష్ రాయదుర్గం అభివృద్ధికి వైసీపీ ఇంఛార్జ్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఏ నియోజకవర్గానికి రానన్ని నిధులు రాయదుర్గానికి కాలువ శ్రీనివాస్ తెచ్చారని లోకేశ్ చెప్పారు. రోడ్లు, భవనాల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారికి తీరని నష్టం జరిగిందని రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకువెళ్లారని మండిపడ్డారు.
అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా ? - జగన్‌కు లోకేశ్ సవాల్
రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నాయి : కల్యాణదుర్గంలో జరిగిన శంఖారావం సభలో లోకేశ్ వైసీపీ అరాచకాలపై ధ్వజమెత్తారు. చట్టాలు ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయని కూటమి ప్రభుత్వం వచ్చాక వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
హలో ఏపీ - బైబై వైసీపీ : అనంతపురం జిల్లాలో జరిగిన శంఖారావం మూడు సభలకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, పార్టీ నాయకులు తరలివచ్చారు. హలో ఏపీ బైబై - వైసీపీ నినాదామే లక్ష్యంగా తెలుగుదేశం కార్యకర్తలు పని చేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. శంఖారావం సభల్లో పాల్గొన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు, 300 మంది హత్య: లోకేశ్