MP Raghunandan Rao Meet The Press : మనుషులను మనుషులుగా చూడని ముఖ్యమంత్రులను వద్దని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు నిరూపించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అందుకే ఉభయ రాష్ట్రాల ప్రజలు వారికి వ్యతిరేకంగా తగిన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పలు అంశాలపై స్పందించారు. ఇందిరాగాంధీ వచ్చి పోటీ చేసిన తర్వాత మెదక్ అభివృద్ధి జరిగిందనడం ఉత్తమాట అని ఎంపీ వెల్లడించారు. అంతకు ముందే మెదక్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మెదక్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని రఘుందన్ రావు హామీ ఇచ్చారు. త్వరలో ఆర్ఆర్ఆర్ కూడా రాబోతుందని, పరిశ్రమలు నగరానికి దూరంగా తరలించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఐటీఐఆర్‌ను గతంలో మన్మోహన్ సింగ్ ప్రతిపాదించారని, ఐటీఐఆర్ కింద ఇచ్చిన ప్రతిపాదనలను కేంద్రం పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ప్రభుత్వం రద్దు చేసిందని, అయితే గతంలో కాంగ్రెస్ ప్రతిపాదనలు ఎంత మేర పూర్తిచేశామో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
నీట్ అవకతవకలపై విపక్షాలవి దుష్ప్రచారాలని, కావాలనే ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నాయని రఘునందన్‌రావు ధ్వజమెత్తారు. పేపర్ లీక్ అంశం వాస్తవ దూరమైన విషయమని, ప్రతిపక్షాలు కేంద్రంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుని అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ అంశం కోర్టులో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనంటూ వ్యాఖ్యానించారు.
రఘునందన్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు - Harish Rao Greetings Raghunandanrao
పెండింగ్‌లో ఉన్న మల్లన్నసాగర్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, గతంలో మెదక్ కలెక్టర్ దృష్టికి సమస్యలు తెచ్చినా పరిష్కరించలేదని ఆరోపించారు. బీజేపీ నేతల పోరాటంతో రైతులకు రూ.13 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు పరిహారం వచ్చేలా చేసినట్లు తెలిపారు. కలెక్టర్ గా పనిచేసి ఆ తరవాత ప్రజాప్రతినిధిగా మారిన వెంకట్ రాంరెడ్డి ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకుని ధరణి స్లాట్స్ బ్లాక్ చేసి అనేక ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. ములుగు మండలం క్షీరసాగర్ లో 80 ఎకరాల భూమిని ఈవిధంగానే చేశారని, ఇక్కడి నుంచే భూసేకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేస్తూ వస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కలా, అధికారం కోల్పొయి తరువాత మాట్లాడటం పరిపాటిగా మారిపోయిందని ఎంపీ రఘునందన్ తెలిపారు. కోల్ మైనింగ్ సంబంధిచి పార్లమెంట్ లో చేసిన చట్టానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. బొగ్గు గనుల వేలానికి సంబంధించి కేంద్రం వాటా 49 శాతం అని, తెలంగాణ ప్రభుత్వ వాటాయే ఎక్కువని పేర్కొన్నారు. బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ నేతలతో భహిరంగ చర్చకు సిద్దమని రఘునందన్ రావు వెల్లడించారు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మెదక్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. కోల్ మైనింగ్ సంబంధిచి పార్లమెంట్లో చేసిన చట్టానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. సింగరేణిలో బొగ్గు గనులకు సంబంధించి కేంద్రం వాటా 49 శాతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతంగా ఉంది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నాం. కోల్ మైనింగ్ చట్టానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు తెలిపింది. ఈ అంశంపై చర్చ జరగాల్సి ఉంది.-' రఘునందన్ రావు, మెదక్ ఎంపీ