MP kanakamedala Ravindra Kumar on Land Titling Act: దౌర్జన్యంగా ప్రజల నుంచి కాజేసిన ఆస్తులకు చట్టబద్ధత కల్పించుకునేందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని ఎంపీ, తెలుగుదేశం సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ఆస్తుల సంరక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులకు భిన్నంగా ఈ చట్టం తెస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో వైఎస్సార్సీపీ సర్కార్ పాల్పడుతున్న మోసాన్ని వివరించారు.
మా భూములకు రక్షణ లేకుండా పోతుంది- ప్రజల హక్కులకు భంగం : రైతులు - Land Titling act People Problems
"టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు సెక్షన్ 5 కింద అథారిటీని నియమిస్తారు. సెక్షన్ 5 కింద ప్రాంతాల వారీగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ను నియమిస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ప్రభుత్వం 3 రకాలుగా విభజించింది. ప్రజల స్థిరాస్తులు అంటే వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, అపార్టుమెంట్లు, వ్యాపార భవనాలు. మళ్లీ వీటిని 3 రకాలుగా విభజించారు. వివాదాలు లేనివి, వివాదాలు ఉన్నవి, రాతపూర్వక ఒప్పందాలు. మూడు రకాల అంశాలను టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు రికార్డులు తయారుచేస్తారు. అందరి వివరాలు తీసుకున్నాక రికార్డులను నోటిఫై చేస్తారు. నోటిఫై చేశాక మనం రెండేళ్లలోపు చూసుకుని సరిదిద్దించుకోవాలి. ఒకవేళ రెండేళ్లలోపు చూసుకోకపోతే మన ఆస్తి మనకు రాదు. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరి పేరుతో నమోదు చేస్తారో వారి పేరుమీదే ఆస్తి ఉంటుంది." - కనకమేడల రవీంద్రకుమార్, తెలుగుదేశం సీనియర్ నేత
YSRCP GOVT Land Titling Act: కాగా జగన్ ప్రభుత్వం బలవంతంగా తీసుకువస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూములకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యజమానికి తెలియకుండా ఇతర వ్యక్తులు తమ భూములను కాజేసే అవకాశం ఉందని రైతులు కలవరపడుతున్నారు.
భూ హక్కు చట్టం అమలోకి వస్తే పూర్తిగా తమ భూములు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాదులు సైతం డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు చేపట్టారు. జగన్ సర్కార్ భూ యాజమాన్య హక్కులను కాలరాస్తోందని, ఈ నేపథ్యంలో వెంటనే జీవో 512ను రద్దు చేయాలంటూ ఆందోళలు చేశారు. ప్రజల హక్కులను హరించే విధంగా జీవో ఉందని, ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.