Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అగ్రనేతలు, సభలు రోడ్‌షోలతో దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం నాడు రాష్ట్రానికి ప్రధాని మోదీ మరోసారి రానున్నారు. ఒకేరోజు రెండు సభల్లో పాల్గొననున్నారు. ముందుగా కర్ణాటక రాష్ట్రం గుల్భర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నారాయణపేటకు మధ్యాహ్నాం 3:03కి చేరుకోనున్నారు.
నారాయణపేట జూనియర్ కళాశాల మైదానంలో మహాబూబ్‌నగర్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3:15 నుంచి 4:05 వరకు బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. నారాయణపేట సభ ముగించుకుని అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5:10కి హైదరాబాద్‌కు చేరుకోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు.
హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపి ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సభలో ప్రధాని 5:30 నుంచి 6:20 వరకు పాల్గొననున్నారు. బహిరంగ సభ అనంతరం 6:40కి బేగంపేట విమానాశ్రయం నుంచి భువనేశ్వర్‌కు బయల్ధేరి వెళ్లనన్నారు. ప్రధాని సభ కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మోదీ సభ విజయవంతం కోసం భారీగా జనసమీకరణ చేస్తోంది. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరడంతో నారాయణపేట, ఎల్బీ స్టేడియం వేదికగా ప్రధాని ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ట్రాఫిక్ ఆంక్షలు విధింపు.. మరోవైపు ప్రధాని మోదీ బహిరంగ సభ సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఎల్బీస్టేడియం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి గ్రీన్‌ల్యాండ్స్, మోనప్ప ఐలాండ్, ఖైరతాబాద్ పై వంతెన, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి కూడలి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి మీదుగా అనుమతించనున్నారు.
బషీర్‌బాగ్ మీదుగా ఏఆర్ పెట్రోల్ బంక్ వైపు వచ్చే వాహనాలను గన్‌ఫౌండ్రి ఎస్బీఐ, ఆబిడ్స్ జీపీఓ మీదుగా నాంపల్లి వైపు మళ్లిస్తారు. సుజాత పాఠశాల మీదుగా ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం మీదుగా వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. రసూల్‌పుర కూడలి, పీఎన్‌టీ చౌరస్తా, బేగంపేట పై వంతెన, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ పై వంతెన, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి విగ్రహం, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ఎస్బీఐ గన్‌ఫౌండ్రి, నాంపల్లి, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్ తదితర ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాహనాలను ఆయా ప్రాంతాల మీదగా ప్రయాణించవద్దని పోలీసు అధికారులు తెలిపారు. ఏమైనా ఇబ్బందులుంటే వాహనదారులు ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ ఫోన్ నెంబర్ 9010203626 ను సంప్రదించాలని ఉన్నతాధికారులు సూచించారు.