MLA Yennam Srinivas on Phone Tapping Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి డీజీపీ రవిగుప్తాకు వినతిపత్రం అందజేశారు. ఫోన్ టాపింగ్ కేసులో తాను కూడా ఒక బాధితుడినేనని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నాయకులు, ప్రశ్నించే గొంతులపై ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌తో అప్పటి ప్రతిపక్ష నాయకులను నిర్బంధంలో పెట్టి ఇబ్బంది పెట్టారన్నారు. ప్రణీత్‌రావు బృందం భారత ప్రభుత్వ అనుమతి లేకుండా ఇజ్రాయిల్ నుంచి హైటెక్ టెక్నాలజీతో పనిచేసే పరికరాన్ని ఉపయోగించి ఫోన్ టాపింగ్ చేసినట్లు ఆరోపించారు.
వేల సంఖ్యలో బాధితులు : అందుకు తన దగ్గర తగిన ఆధారాలున్నాయని, వాటిని డీజీపీకి సమర్పించారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రణీత్ రావు ముఠా రాష్ట్రవ్యాప్తంగా సర్వర్లు పెట్టి, రాజధాని కేంద్రంగా ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ టాపింగ్ దుర్మార్గమైన చర్యని, ఎవరి ఒత్తిడి వల్ల చేశారో తెలంగాణ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులు ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Congress leader Niranjan reddy on Phone Tapping Case : ఇదికాగా మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తుందని, రాష్ట్రంలోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ధ్వజమెత్తారు. ముగ్గురు కీలకమైన అధికారులు రెవెన్యూ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ప్రణీత్‌రావు బ్యాచ్ వ్యాపారస్థులను కూడా బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దండుకుందని మండిపడ్డారు. ఈ విషయంలో డీజీపీ, హోం సెక్రటరీకి లేఖ రాస్తామని తెలిపారు.
'గత అయిదు సంవత్సరాలుగా ఎవరి ఒత్తిడితో ఫోన్ ట్యాపింగ్ చేశారో. దానికి ఎవరు సూచన ఇస్తే ఫోన్ ట్యాపింగ్ చేశారో తెలియాలి. వివిధ జిల్లాలో సర్వర్లు ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలు, బంగారు వర్తకులు, ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వాయిస్ విని వాళ్లతో లావాదేవీలు చేశారో, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియాలని ఈరోజు నేను డీజీపీని కోరుకుంటున్నా. కేవలం హైదరాబాద్ బేస్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తే లక్షలాది మంది బాధితులు జిల్లాలో ఉన్నారు. అక్కడ కూడా దీని కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి.'- యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే
ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు : ఎర్రబెల్లి దయాకర్ - ERRABELLI ON PHONE TAPPING CASE