MLA Palla Rajeshwar Reddy Speech in Assembly 2024 : గవర్నర్‌తో ముప్పై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. ప్రగతి భవన్ గతంలో కూడా ప్రజాభవన్ అని అన్నారు. ప్రగతిభవన్‌లోనే ప్రజా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. సింగరేణి సమస్యలు పరిష్కరించింది అక్కడేనని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొన్ని మాట్లాడారు.
Palla Comments on CM Revanth Reddy : ప్రజాభవన్‌కు వచ్చేవారి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరని, రెండు నెలల్లో ఎవరి సమస్యలనైనా పరిష్కరించారా అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రతిరోజు ప్రజాభవన్‌కు వస్తానని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చెప్పారని, గంటసేపైనా ప్రజల కష్టాలు వింటా అని చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ రెండోరోజు నుంచి ముఖ్యమంత్రి ప్రజాభవన్‌కు వెళ్లలేదని, ప్రజల కష్టాలు వినలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
Palla Fires on Governor Speech : చట్టసభల్లో అబద్ధాలు చెప్పడం తీవ్ర నేరమని పల్లా రాజేశ్వర్‌రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) అన్నారు. మీరు చెప్పిన 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయని చెప్పారు. వాటిలో రెండు పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. నిర్దిష్ట గడువు చెప్పిన గ్యారంటీలు అమలు చేయాలనే తాము అడుగుతున్నామని పేర్కొన్నారు. సీఎం చెప్పిన గడువు తీరినా హామీలు అమలు చేయనందునే ప్రశ్నిస్తున్నామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.
గవర్నర్ ప్రసంగం పేలవంగా ఉంది - ప్రభుత్వం తన విజన్‌ను ఆవిష్కరించలేదు : హరీశ్‌రావు
'బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళల కోసం బస్సులు పెంచాలని కోరుతున్నాం. మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలి. ఆరున్నర లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు. ఈఎంఐలు కట్టలేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉపాధి లేక 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. ఆటో డ్రైవర్ల రుణాలు మాఫీ చేయాలి. వారికి నెలకు రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవాలని' పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
"గత ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. పదేళ్లలో 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మేం 1,60,000ల ఉద్యోగాలు భర్తీ చేశాం. నర్సుల పోస్టులు మేం భర్తీ చేశాం. మా హయాంలో వ్యవసాయాన్ని నెంబర్‌వన్‌గా నిలిపాం. పదేళ్లలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. వరికి ఇస్తామన్న రూ.500 బోనస్ యాసంగిలోనైనా ఇస్తారా లేదా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెంచాలి. క్రానీ క్యాపిటల్ వద్దని రాహుల్ గాంధీ చెప్పారు. అదానీ ఇక్కడకు వస్తే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది." - పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Telangana Assembly Sessions 2024 : ప్రభుత్వం ఫార్మా సిటీ రద్దు చేస్తామన్న ఆలోచన మంచిది కాదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. రద్దు ప్రచారంతో పారిశ్రామికవేత్తల్లో ఆందోళన ఉందని చెప్పారు. ఫార్మా సిటీకి హైదరాబాద్ రాజధానిగా ఉన్నట్లు తెలిపారు. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రస్థానం సాధించిందని, హైదరాబాద్‌లో మరిన్ని ఏఐ, డ్రోన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం - అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన
ఆ విషయంలో సీఎం క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల పట్టు - మండలిలో గందరగోళం