Ministers Fire on YSRCP Govt in Legislative Council: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేసిందని శాసనమండలిలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు కనీస గౌరవం లేదని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చినా పంచాయతీ ఖాతాలకు వెళ్లలేదని చెప్పారు. పంచాయతీలకు విడుదల చేసిన 9 వేల కోట్ల రూపాయల గ్రాంటును గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ నిధుల మళ్లింపుపై కమిషన్ వేసి అక్రమాలపై నిగ్గు తేలుస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రశ్నోత్తరాల్లో మంత్రి ఆనం: గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. పరకామణి నిధుల లెక్కింపులో రవికుమార్ అనే వ్యక్తి వల్ల రూ. 100 కోట్ల పైనే టీటీడీకి నష్టం వచ్చిందని తనకు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో దీనిపై కేసు నమోదు చేసి లోక్ అదాలత్ ద్వారా కాంప్రమైజ్ చేశారన్నారు. తిరుమలలో జరిగిన అనేక అక్రమాల నేపథ్యంలో ప్రక్షాళనకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
దీంతోపాటు పవిత్రమైన తిరుమలను గంజాయికి మాఫియా కేంద్రంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చిందని మండిపడ్డారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులనుంచి రూ.1,300 కోట్లు వసూలు చేశారని, అందులో రూ.1000 కోట్లే బ్యాంకులో డిపాజిట్ చేయగా మిగతా రూ.300 కోట్లు ఏమయ్యాయో తేలాల్సి ఉందన్నారు. భగవంతుని సొత్తు దొంగలపాలవుతుందన్న ఆయన శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకుంటామన్నారు.
శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతిధులకు ఇచ్చే సిఫార్సు లేఖలపై గత ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శించిందన్నారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ సభ్యుడైన తనకే సిఫార్సు లేఖలను మంజూరు చేయలేదన్నారు. సిఫార్స్ లేఖలు పెంచాలన్న వినతిపై సీఎంతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
ప్రశ్నోత్తరాల్లో మంత్రి కొల్లు రవీంద్ర: 2019-24 మధ్య రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలు జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అక్రమ తవ్వకాలపై 1,766 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీనికి సంబంధించి రూ.4,037 కోట్ల జరిమానా విధించారన్న ఆయన అందులో కేవలం 18.06 కోట్లు మాత్రమే రాబట్టినట్లు వెల్లడించారు. మిగిలిన రూ.4,019 కోట్ల జరిమానా రాబట్టేందుకు చర్యలు తీసుకోలేదని, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ప్రశ్నోత్తరాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పౌర సరఫరాల కార్పొరేషన్‌ను అప్పులపాలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ధాన్యం సేకరణ పేరిట రూ.39,550 కోట్ల అప్పులు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించాల్సి ఉండగా నిధులు మళ్లించారన్నారు. కనీసం రూ.1,650 కోట్లు రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించకుండా గత ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు రూ.1,000 కోట్లు బకాయిలు చెల్లించామన్నారు.
గత ప్రభుత్వంలో కాకినాడ కేంద్రంగా వేల మెట్రిక్ టన్నుల చౌక బియ్యం ఇతర దేశాలకు అక్రమంగా తరలించారని ధ్వజమెత్తారు. బియ్యం తరలింపులో వైఎస్సార్సీపీ నేత ద్వారంపూడి నేతృత్వంలో వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరుగుతోందని, పాత్రదారులు, సూత్రదారులు ఎవ్వరినీ వదలిపెట్టమని హెచ్చరించారు.
"అది కదా రహస్యం" - కేంద్ర నిధులు రాబట్టడంలో చంద్రబాబు చాణక్యం - AP SPECIAL FUNDS IN BUDGET 2024