Minister Tummala on Crop Insurance : రాష్ట్రంలో రిజర్వాయర్లలో నీరు అడుగంటిన వేళ, పంటలు ఎండిపోవద్దని భూగర్భ జలాలతో పండించుకునేలా నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తున్నట్లు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala) అన్నారు. ఇవాళ ఖమ్మంలో పర్యటించిన ఆయన, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తుక్కుగూడ సన్నాహక సమావేశంపై మాట్లాడారు.
రాష్ట్రంలో ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, గత ఏడు నెలలుగా వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీరు అనుకున్నంత రాలేదని తుమ్మల పేర్కొన్నారు. యాసంగి వరి వేయవద్దని సూచించినా, కొంత మంది రైతులు వేశారన్నారు. గత ప్రభుత్వం వర్షాకాలం పంటకే సాగర్ నీరు అందించలేదన్నారు. వారి హయాంలోనే పక్క రాష్ట్రం వాళ్లు నీళ్లను తరలించుకుపోయారని దుయ్యబట్టారు. ఇప్పుడు యాసంగి నీళ్లు ఇవ్వాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.
Farmer Loan Waiver in telangana : రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందని తుమ్మల దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఎత్తి వేసిందని మంత్రి మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైందని, రుణమాఫీ నిధుల కోసం హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు అమ్మేశారన్నారు. విడతల వారీగా ఇచ్చిన నిధులు వడ్డీ కిందే జమయ్యాయని పేర్కొన్నారు.
అకాల వర్షాలతో, నీరు లేక ఎండిపోయి పంట నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామన్నారు. రాష్ట్రంలో పంటల బీమా పథకం (crop insurance) అమలు చేయనున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియాన్ని చెల్లిస్తుందని ఆయన స్ఫష్టం చేశారు. ఆర్బీఐతో చర్చించి రూ.2 లక్షల రైతు రుణమాఫీపై కసరత్తు చేస్తున్నామని, వీలైనంత త్వరగా మాఫీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తుక్కూగూడలో జరిగే సభను విజయవంతం చేసేలా జిల్లా నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
"రైతులు భూగర్భ జలాలతో పంటలు పండించుకునేలా, నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోంది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు చెల్లిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తాం. ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతు రుణమాఫీకి కసరత్తు చేస్తున్నాం. ఏకకాలంతో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం". - తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి
నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది : మంత్రి తుమ్మల
"ఆయిల్‌పామ్ పంటకు లాభదాయకమైన ధరలు ప్రకటించాలి"- కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ