Minister Seethakka Comments on BJP : ఎంపీ అభ్యర్థి ఎవరైనా ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి తప్ప, ఇతరుల కోసం పనిచేసేవారు రాజకీయాల్లో ఎన్నడూ ఎదగలేరని మంత్రి సీతక్క అన్నారు. వాస్తవానికి ఆదిలాబాద్లో కాంగ్రెస్ గెలిచేదని, కానీ తమ పార్టీలోనే కొంతమందికి ఎంపీ అభ్యర్థి నచ్చకపోవడంతోపాటు కొన్ని కుట్రలు జరిగాయని ఆరోపించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా శక్తి వంచన లేకుండా శాయశక్తులా కృషిచేశానని చెప్పారు. నియోజకవర్గ ఓటమిపై సమీక్షించిన నేపథ్యంలో కొంతమంది నాయకుల వల్లే ఆ స్థానాన్ని కోల్పోయినట్లు తెలుస్తోందని తెలిపారు. అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఎదగరని, మనస్ఫూర్తిగా పనిచేసే వారే భవిష్యత్తులో మంచి నేతలుగా ఎదుగుతారన్నారు.
శుక్రవారం మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పలు గ్రామాలలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ క్రమంలో ముకాళ్లపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో శివసత్తులతో కలిసి కాసేపు నృత్యం చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాయకులు రాముని పేరు చెప్పి ఓట్లు అడిగారని, కానీ అయోధ్యలోనే అక్కడి ప్రజలు మోదీని నిరాకరించారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వాలను కూలగొట్టిన ఘనత బీజేపీదే : ప్రధాని నరేంద్ర మోదీ తన స్వార్థం కోసం ఎన్నికలు నిర్వహించేందుకు మూడు నెలలు సమయం తీసుకున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. కాంగ్రెస్ను నిర్వీర్యం చేయాలని, తమ ప్రజా కార్యక్రమాలు అడ్డుకోవాలనే ఇన్ని రోజులు సమయం తీసుకున్నారని విమర్శించారు. రాముని పేరు చెప్పి బీజేపీ నాయకులు రాజ్యాలను కూలగొడుతున్నారని ధ్వజమెత్తారు. దాదాపు పది రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టిన ఘనత బీజేపీకే దక్కుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రజా పాలన దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలను స్వేచ్ఛగా కలుస్తున్నానని పేర్కొన్నారు.
'ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల్లో కొన్ని కుట్రలు జరిగాయని నిర్వహించిన రివ్యూలో తెలుస్తోంది. కొంతమంది ఎంపీ అభ్యర్థి ఇష్టం లేదని, కానీ కొంత మంది కష్టపడ్డారు. వాస్తవానికి గెలిచే సీటు. 50 వేల మెజార్టీ వస్తే గెలిచే వాళ్లం. ఒకే జెండా కింద పనిచేసే వారందరూ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి తప్ప, ఆ అభ్యర్థి మావాడు కాదని అభ్యర్థి తరఫున పనిచేయకుండా ఇతరుల కోసం పనిచేసేవారు రాజకీయాల్లో ఎదగలేరు'- సీతక్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
పిల్లల దత్తత ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలి : మంత్రి సీతక్క
అనసూయగా ప్రారంభమై - మంత్రిగా ప్రజల మన్ననలు పొంది - స్ఫూర్తిదాయకం సీతక్క ప్రయాణం