Minister Savitha Allegations on YSRCP Leaders : ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతల అరాచకాలు అన్నీ ఇన్నీ కావని మంత్రి సవిత ఆరోపించారు. అధికారులను తుపాకీ పెట్టి బెదిరించి పనులు చేసుకున్నారని అన్నారు. కడప డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న మంత్రి సవిత, సీఎం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న మంచి పాలనకు అధికారులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రావడానికి ఎన్డీఏ కూటమి నేతలు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పాలన సాగించడానికి సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారనీ మంత్రి గుర్తు చేశారు.
డీఆర్సీ సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు : గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్న మంత్రి, గతంలో అధికారులు కూడా ఏ విధంగా పని చేశారో అందరికీ తెలుసని అన్నారు. కొందరు అధికారులు నిజాయితీగా పని చేస్తే, మరికొందరు అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి పని చేశారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు అధికారులపై గన్ పెట్టి బెదిరించి పనులు చేయించుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
కడప రూపురేఖలు మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని, జిల్లా అధికారులంతా ప్రజాప్రతినిధులకు సహకరించి పనులు చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కడప కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశానికి కూటమి ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు జిల్లా అధికారులంతా హాజరయ్యారు.
వైఎస్సార్సీపీ భూకబ్జాలపైనే ఫిర్యాదులొస్తున్నాయి: మంత్రి సవిత - Minister Savitha Received Requests