Minister Ponnam on Union Budget 2024 : చారిత్రక నగరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవటం వివక్ష కాదా అని, బీజేపీ సభ్యులనుద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే లేకుండా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అంటే మోదీకి మొదట్నుంచి చిన్నచూపని, రాష్ట్ర ఏర్పాటునే ప్రధాని ఎన్నోసార్లు అవమానించారని మంత్రి ఆరోపించారు.
కేంద్రమంత్రులు కనీసం వారి నియోజకవర్గాలకు కూడా నిధులు తెచ్చుకోలేకపోయారని విమర్శించారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉంటే నిధులు ఇస్తారని భావించామన్న ఆయన, సుష్మా స్వరాజ్‌ను తాము చిన్నమ్మ అని పిలిస్తే, బీజేపీ మమ్మల్ని చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. మతం పేరుతో ఓట్లు వేయించుకోవడమే కానీ రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. కేంద్రంలో కుర్చీ కాపాడుకోవటానికి ఏపీ, బిహార్‌కు మాత్రమే నిధులు ఇచ్చారని ధ్వజమెత్తారు.
మూసీ శుద్ధికి నిధులు అడిగితే అవినీతి కోసం అడిగినట్లా? : తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే, 40 పైసలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో బీజేపీ సభ్యులు చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ శుద్ధికి నిధులు అడిగితే అవినీతి కోసం అడిగినట్లా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. గంగ, సదర్‌మట్ శుద్ధిని మోదీ ప్రభుత్వం చేపట్టాలేదా? గంగ, సదర్‌మట్ శుద్ధిని కమీషన్ల కోసమే చేపట్టారా? అని ఘాటుగా స్పందించారు.
రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 7 మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపారన్న మంత్రి, దాని ఫలితంగానే సీలేరు ప్రాజెక్టును కోల్పోయామని వాపోయారు. అఖిలపక్ష నేతలను కేంద్రం వద్దకు బీజేపీ నేతలు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సిరిసిల్లకు కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన హక్కులు ఏపీతో పాటు తెలంగాణకు దక్కాలి : చేనేత కార్మికులపై ఆత్మహత్యలపై రాజకీయాలు చేసే, బండి సంజయ్ నిధులు ఎందుకు తేలేదని ధ్వజమెత్తారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌కు బండి సంజయ్ నిధులు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ, ఎన్నో దరఖాస్తులు ఇచ్చిన కనీసం పట్టించుకోలేదన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన హక్కులు ఏపీతో పాటు తెలంగాణకు దక్కాలని అన్నారు. బీజేపీకు తెలంగాణ ప్రజలు ఎనిమిది సీట్లు ఇచ్చిన, మోదీ అన్యాయం చేశారన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిధులు తేకుండా తెలంగాణ గడ్డపై ఎట్లా కాలు మోపుతారని ప్రశ్నించారు. ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు గుజరాత్‌కు పోతారా? బీహార్‌కు పోతారా? ఏపీకి పోతారో తేల్చుకోవాలన్నారు.
సీఎం రేవంత్ VS కేటీఆర్ - అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం - telangana assembly meetings 2024