Ponnam on Central Budget 2024 : కేంద్ర బడ్జెట్‌లో విభజన హామీలతో పాటు రాష్ట్రానికి అవసరమైన నిధులను కేటాయించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి తగిన నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. సమాఖ్య విధానంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయి ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌లో మెట్రో, ఆర్ఆర్ఆర్ తదితర అభివృద్ధి పనులతో పాటు నగర పర్యాటక అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.
పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం జరిగిందని, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు కూడా విడుదల చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల నిర్మాణానికి నిధులు పెంచడంతో పాటు నవోదయ, సైనిక్ స్కూళ్లు మంజూరు చేయాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సహకరించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు, ఓయూ, వ్యవసాయ వర్సిటీకి నిధులు కేటాయించాలన్నారు.
కిషన్ రెడ్డి టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ పర్యాటక అభివృద్ధికి ఒక్క రూపాయీ కేటాయించలేదని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను అధికారులు, మంత్రులు, సీఎంల కమిటీ పరిష్కరిస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి చెందిన 17 మంది లోక్సభ, 8 మంది రాజ్యసభ సభ్యులు కలిసికట్టుగా నిధుల సాధనకు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగే విధంగా ఉండాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. విభజన చట్టానికి సంబంధించి రూ.600 కోట్లు రావాల్సి ఉంది. ప్రజా పంపిణీ విషయంలో కేంద్ర నిధుల్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం. నిత్యవసర సరుకుల ధరల విషయంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి, నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలకు సాయం అందించేందుకు కిషన్‌రెడ్డి ముందుకు రావాలి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి చెందిన 17 మంది లోక్సభ, 8 మంది రాజ్యసభ సభ్యులు కలిసికట్టుగా నిధుల సాధనకు కృషి చేయాలి. - పొన్నం ప్రభాకర్, మంత్రి