Nara Lokesh on Nadu Nedu Works : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ రెండోరోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు, తెనాలి శ్రవణ్‌కుమార్ సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
నాడు-నేడులో పెద్ద ఎత్తున దోపిడీ : నాడు-నేడు ద్వారా అద్భుతాలు జరిగినట్లు వైఎస్సార్సీపీ నేతలు ప్రచారం చేసుకున్నారని, కానీ పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. తమకు కావాల్సిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టారని చెప్పారు. తన నియోజకవర్గం పొన్నూరులో పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారని సభ దృష్టికి ఆయన తీసుకువచ్చారు. పాత భవనాలకే రంగులు వేసి బిల్లులు పెట్టారని తెలిపారు. పాఠశాలల్లో బాగున్న నాపరాయి ఫ్లోరింగ్ తీసివేసి గ్రానైట్ వేశారని విమర్శించారు. దీనికోసం అంచనా వ్యయం పెంచి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. పనులు అయ్యాక కూడా పాఠశాలల్లో టాయిలెట్లు ఘోరంగా ఉన్నాయని వివరించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని ధూళిపాళ్ల ప్రభుత్వాన్ని కోరారు.
కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన వైఎస్సార్సీపీ నేతలు : వైఎస్సార్సీపీ నేతలనే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తించారని ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. చాలా చోట్ల పనులు చేపట్టి కూడా పాఠశాలలను మూసివేయించారని, ఇది దారుణమని చెప్పారు. విద్యాశాఖకు మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఈ వ్యవస్థను గాడిలో పెడతారనే నమ్మకం అందరికీ ఉందని ఆయన వివరించారు.
Nara Lokesh Speech in Assembly : అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. నాడు-నేడుపై సర్కార్ విచారణ చేపడుతుందని తెలిపారు. గతంలో నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు? పనులు ఎందుకు సరిగా జరగలేదు? అనే అంశాలపై ఆరా తీస్తామని వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామని, అందుకే మెగా డీఎస్సీ వేశామని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సంఖ్యను పెంచుతామని లోకేశ్ వివరించారు.
కేజీ-పీజీ వ్యవస్థ ప్రక్షాళన చేపడతాం : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టిందని లోకేశ్ విమర్శించారు. ఆ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఒక పద్ధతి ప్రకారం అన్నీ చేస్తామని తెలిపారు. తొలి ఏడాదిలో కేజీ టు పీజీ వ్యవస్థ ప్రక్షాళన చేపడతామని లోకేశ్ వ్యాఖ్యానించారు.
'ఇల్లు పీకి పందిరేశారు!' - నాడు, నేడు పనుల్లో అంతులేని నిర్లక్ష్యం - Nadu Nedu School Works